ప్రశాంతి నిలయం: గోరంట్ల మండలానికి చెందిన ఓ రైతుకు చెందిన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. గోరంట్ల మండలం బూదిలికి చెందిన కురుబ మల్లేశప్పకు సర్వే నంబర్ 476లో 3.30 ఎకరాల భూమి ఉందన్నారు. దీన్ని చాలా కాలంగా నిషేధిత జాబితా 22ఏ (1) (ఇ) ఉంచారన్నారు. దాన్ని మంగళవారం నిషేధిత జాబితా నుంచి తొలగించామన్నారు. ఈ సందర్భంగా మల్లేశప్ప కలెక్టర్‌కు కృతజ్ఙతలు చెప్పారు. కలెక్టర్ స్వయంగా రైతును శాలువతో సన్మానించారు.
మొహర్రం పండుగకు చెట్లు నరకవద్దు
ప్రశాంతి నిలయం: మొహర్రం పండుగను పురస్కరించుకొని అగ్ని గుండలోకి వేయాలంటూ ఎవరూ చెట్లను నరకవద్దని కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. మొక్కలు, చెట్లను కాపాడుకోవడం మన బాధ్యతన్నారు. చెట్ల వల్ల మనం పీల్చే ప్రాణవాయువు అందుతోందన్నారు. గ్రామ పొలిమేరల్లో ఉన్న సర్కార్ జాలి, కంపచెట్లు, మొద్దులను తీసి అగ్ని గుండంలో వేయాలన్నారు. సంబంధితశాఖ అధికారులు సమన్వయం చేసుకొని చెట్లు నరకకుండా ప్రజలకు అవగాహన పెంచాలన్నారు.
రీ సర్వే పనులను
త్వరగా పూర్తి చేయండి
పుట్టపర్తి అర్బన్: నల్లమాడ మండలంలో దొన్నికోటలో రీ సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం దొన్నికోట గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను సకాలంలో అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు .రీ సర్వేలో ఎలాంటి తప్పుల్లేకుండా గడువులోపు పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.


