సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూగజీవాల వేదన అరణ్య రోదనగా మారింది. తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడి పశుగ్రాసం కొరతతో రైతులు పశువులను అమ్మేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు అక్రమ మార్గంలో వాటిని కబేళాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చుట్టుపక్కల జిల్లాల లోని సంత మార్కెట్‌లలో పశువులను తక్కువ ధరలకే కొనుగోలు చేసి రాత్రిపూట అక్రమంగా కర్ణాటక తరలిస్తున్నారు. గేదెలు, ఎద్దులతో పాటు ఆవులు కూడా ఉంటున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలించకుంటే కర్ణాటక బదులు తమిళనాడు, కేరళకు అక్రమంగా రవాణా చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రెండు మార్గాల్లో పశువుల కంటైనర్లు సరిహద్దు దాటిపోతున్నాయి. జాతీయ రహదారి పై సోమందేపల్లి, చిలమత్తూరు మీదుగా కర్ణాటక చేరుతున్నట్లు సమాచారం. మరోవైపు కదిరి, తనకల్లు మీదుగా కర్ణాటకలో ప్రవేశిస్తున్నట్లు తెలిసింది. ఆయా మార్గాల్లో అధికారుల తనిఖీలు అంతంత మాత్రంగానే ఉండటంతో పశువుల అక్రమ రవాణా వ్యాపారం రాత్రింబవళ్లు దర్జాగా సాగిపోతోంది. అక్కడక్కడా ప్రజలు పసిగట్టి పోలీసులకు సమాచారం ఇస్తే కానీ పట్టుకోవడం లేదు.
కంటైనర్లలో కుక్కి..
అక్రమార్కులు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా మార్చుకుని పశువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో భారీ కంటైనర్‌లో సామర్థ్యానికి మించి 70 నుంచి 80 పైగా పశువులను ఎక్కిస్తున్నారు. అవి కదలకుండా ఉండేందుకు గట్టిగా తాళ్లతో కట్టేసి గంటల తరబడి నరకం చూపిస్తున్నారు. ఇటీవల నంద్యాల నుంచి కర్ణాటక వెళ్తున్న కంటైనర్‌ను ఎన్‌పీ కుంట వద్ద తనిఖీలు చేసి పట్టుకోవడంతో మూగవేదన బయటపడింది.
పక్కా ప్లాన్‌తో ముందుగానే..
పశువుల కంటైనర్‌లను తరలించే దాని కంటే ముందుగా ఆ మార్గంలో ఒక కారు లేదా బైక్ అరగంట ముందే బయలుదేరుతుంది. ఎలాంటి సమస్య లేదని ముందు వెళ్తున్న వాహనం నుంచి కంటైనర్ డ్రైవర్‌కు సమాచారం ఇస్తుంటారు. ఎలాంటి నిఘా ఉండదని తెలిసిన తర్వాత అతివేగంతో పశువుల వాహనాలు వెళ్తుండడం గమనార్హం.
ఆగని పశువుల అక్రమ రవాణా దందా
పోలీసుల కళ్లు కప్పి
కబేళాలకు తరలింపు
కంటైనర్లలో కుక్కి రాత్రి వేళ
అక్రమ రవాణా
సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద
లోపించిన పర్యవేక్షణ
ఇటీవల నంద్యాల నుంచి కదిరి మీదుగా కర్ణాటకకు పశువులను మూడు కంటైనర్లలో అక్రమంగా తరలిస్తుండగా.. ఎన్‌పీ కుంట వద్ద ప్రజలు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపు రెండు కంటైనర్లు వెళ్లిపోగా.. ఒక వాహనం పట్టుబడింది. అందులో 50కు పైగా గేదెలను కుక్కి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి వాహనం సీజ్ చేశారు.
ఇదొక్కటే కాదు.. మూగజీవాలను
అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్న ఘటనలు జిల్లాలో కొన్ని రోజులుగా
పెరిగిపోయాయి.
హిందూపురంలో భారీ విక్రయాలు
పాడి పరిశ్రమ పేరుతో సంతల్లో పశువులను విచ్చలవిడిగా కొంటారు. ఆ తర్వాత వధించి మాంసం అమ్ముతున్నారు. హిందూపురం పట్టణంలో విచ్చలవిడిగా పశు మాంసం విక్రయ కేంద్రాలు వెలిశాయి. అడిగే వారు లేకపోవడం ఎడాపెడా అమ్మకాలు సాగిస్తారు. బెంగ ళూరుకు నిత్యం మాంసం సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
తనిఖీలు అంతంతే..
శ్రీ సత్యసాయి జిల్లా నుంచి కర్ణాటక వెళ్లేందుకు ప్రధానంగా రెండు మార్గాలను ఎంచుకున్నారు. ఆయా మార్గాల్లో అయితే అధికారులు ఎవరూ ఉండరనే కారణంతో అక్రమార్కులు ఆ దారుల్లోనే పశువులను అక్రమంగా తరలిస్తున్నారు. కొక్కంటి సరిహద్దున, కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేయరనే ఉద్దేశంతో పశువుల అక్రమ రవాణా దర్జాగా సాగుతోంది. ఒకరిద్దరు పోలీసులు కంటైనర్‌లను ఆపినా.. అంతో ఇంతో ముట్టచూపితేనే వదిలేస్తారనే ఆరోపణలు ఉన్నాయి.


