తనకల్లు: విద్యుదాఘాతంతో 15 గొర్రెలు మృతి చెందిన ఘటన మండలంలోని మంగదిన్నెపల్లిలో జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన ఆంజినేయులు గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం తన గొర్రెలను ఇంటి నుంచి తీసుకెళ్లి షెడ్‌లో కట్టేశాడు. షెడ్ పైన విద్యుత్ తీగలు గాలికి అటూ ఇటూ ఊగుతూ రేకుల షెడ్‌కు తగలడంతో విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో 15 గుర్రెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు విలపించారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
మృతదేహం లభ్యం
రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద మంగళ వారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు. వృద్ధుడి మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఎవరైనా తప్పిపోయి ఉంటే కుటుంబీకులు పరిశీలించుకోవాలని ఎస్‌ఐ సూచించారు. మడకశిర రూరల్ సీఐ ఫోన్ నంబర్ 9440796820, రొళ్ల ఎస్‌ఐ ఫోన్ నంబర్ 9346010559ను సంపద్రించాలని కోరారు.
12న పాలిటెక్నిక్
కళాశాలలో ఉద్యోగ మేళా
ధర్మవరం అర్బన్: పట్టణంలోని గుట్టకిందపల్లిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 12న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌బాబు తెలిపారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లోపు వారు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని వివరించారు. ఉద్యోగాలకు ఎంపికై న వారు పెనుకొండ, అనంతపురం, బెంగళూరు, హిందూపురం, కళ్యాణదుర్గం, గోరంట్లలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటాతోపాటు ఆధార్‌కార్డు, విద్యార్హత పత్రాలు తీసుకుని ఉదయం 9 గంటలకు కళాశాలలో హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఐదేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి
బత్తలపల్లి: వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని వెంకటగారిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నారి తల్లిదండ్రులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంగాధర్, పరమేశ్వరి దంపతుల కుమారుడు జ్ఞానతేజ సోమవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కుక్కలను తరిమి బాలుడిని రక్షించారు. గాయపడిన చిన్నారిని తీసుకుని వెంటనే బత్తలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడ తాళం వేసి ఉండడంతో ఆర్డీటీ ఆసుపత్రికి వెళ్లి వైద్యం అందించారు. గ్రామంలో వీధికుక్కల బెడద అధికంగా ఉందని, చిన్న పిల్లలు, పెద్దలపై దాడి చేస్తున్నాయన్నారు. పంచాయతీ అధికారులు స్పందించి వీధికుక్కల బారి నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
కదిరి అర్బన్: మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం రాత్రి లారీ ఢీకొని వెంకటేష్ (55) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... కూలి పనులకు వెళ్లిన వెంకటేష్ పనులు ముగిసిన అనంతరం ఇంటికి తిరిగి బయలుదేరాడు.జెడ్పీ హైస్కూల్ వద్ద వెనుక నుంచి లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని రూరల్ అప్ గ్రేడ్ పోలీస్టేషన్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.


