ప్రశాంతి నిలయం: ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌డీసీ–కేఆర్‌సీసీ)గా విజయ కుమారి మంగళవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశిత ప్రాజెక్టులు, రెవెన్యూ పరమైన భూ సేకరణ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. ఆమెకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
53 కిలోల గంజాయి స్వాధీనం
● వ్యక్తి అరెస్టు
పుట్టపర్తి టౌన్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.53 కిలోల గంజాయి, ఒక సెల్‌ఫోన్, కారు స్వాధీనం చేసుకొన్నారు. మంగళవారం ఇన్‌చార్జ్ డీఎస్పీ శివన్నారాయణ, సీఐ శ్రీనివాసులుతో కలసి నల్లమాడ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కదిరి–బెంగళూరు జాతీయ రహదారిలోని పులగంపల్లి సమీపంలో మంగళవారం తనిఖీలు నిర్వహించామన్నారు. కదిరి నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీలు చేయగా, వాహనం డిక్కీలో రెండు మూటల్లో 53 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయన్నారు. వాహనం నడుపుతున్న నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన వెంకటరమణను అరెస్ట్ చేశామన్నారు. రెడ్డిపల్లికి చెందిన మల్లికార్జున ఆదేశాలతో గంజాయి రవాణా చేస్తున్నట్లు నిందితుడు తెలపగా.. అతడిపైనా కేసు నమోదు చేశామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సతీష్‌తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి
హిందూపురం: విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని డీఈఓ క్రిష్ణప్ప అన్నారు. హిందూపురం మండలం బసవనపల్లి హైస్కూల్‌లో 6 మండలాల ఉపాధ్యాయులకు జరుగుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం డీఈఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలు కల్గి విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు డాక్టర్ హెచ్ గంగప్ప, నాగరాజు,ప్రకాష్, సల్మాన్ రాజ్, జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
7 విద్యుత్ సబ్ స్టేషన్ల మంజూరు
అనంతపురం టౌన్: జిల్లాలో కొత్తగా ఏడు సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికిప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. కళ్యాణదుర్గం మండలం బసాపురం, రాయదుర్గం నియోజకవర్గంలోని యర్రగుంట్ల, వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి, రాప్తాడు మండలం బండమీదపల్లి, శింగనమల నియోజకవర్గంలోని బొందలవాడ, గుంతకల్లు నియోజకవర్గం ఖాదర్‌పేటలో 33 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు.


