ధర్మవరం అర్బన్: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ భవనంలో సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాగునీటి కొరత తలెత్తకుండా నీటి విడుదలకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన కాలువను పీఏబీఆర్ కుడి కాలువతో అనుసంధానం చేసి తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం మండలాల్లో ఉద్యాన పంటలకు సాగునీరు, తాగునీటి భద్రత కల్పించే దిశగా చర్యలు వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా నీటి సరఫరాను నిరంతరం కొనసాగించాలని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. కదిరిగేటు రైల్వే ఓవర్ బ్రిడ్జి, గ్రామీణ రహదారులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి, జిల్లాస్థాయి అధికారులు, నియోజకవర్గస్థాయి అధికారులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
సత్యకుమార్‌యాదవ్


