రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

బుక్కరాయసముద్రం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని బొమ్మలాటపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..సోమవారం మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన నాగభూషణ (37), కుళ్లాయప్ప (42), చాంద్‌బాషాలు ద్విచక్ర వాహనంలో నార్పలకు బయలుదేరారు. ఇదే సమయంలో నార్పల మండలం కేసేపల్లికి చెందిన ఎస్‌.అశోక్‌, ఎం.అశోక్‌ ద్విచక్ర వాహనంపై అనంతపురం వెళ్తున్నారు.బొమ్మలాటపల్లి సమీపంలో చెన్నంపల్లి క్రాస్‌ వద్ద ఎదురెదురుగా వీరి ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నాగభూషణ అక్కడికక్కడే మృతి చెందగా, కుళ్లాయప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఘటనలో చాంద్‌బాషాకు కూడా తీవ్ర గాయాలు కాగా ఎం. అశోక్‌, ఎస్‌. అశోక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నాగభూషణకు భార్య నిర్మల, ఓ కుమారుడు, కుమార్తె, కుళ్లాయప్పకు భార్య కృపాదేవి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిసింది.

ఇంటిపై దాడి.. ఏడుగురిపై కేసు

బిడ్డ కులాంతర వివాహం చేసుకుందని దాష్టీకం

రాప్తాడు రూరల్‌: కులాంతర ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిన ఓ యువతి కుటుంబ సభ్యులు యువకుడి నాయనమ్మ ఇంటిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన వరలక్ష్మి, అనంతపురం రూరల్‌ పాపంపేటకు చెందిన మురళి మనోహర్‌ ప్రేమించుకుని రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో ఈ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, యువతి మేజర్‌ కావడంతో కౌన్సెలింగ్‌ నిర్వహించి ఇద్దరినీ కలిసి జీవించేందుకు అనుమతించారు. వివాహాన్ని అంగీకరించని యువతి కుటుంబ సభ్యులు మనోహర్‌ను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రూరల్‌ మండలం పాపంపేట కాలనీలో ఉన్న మనోహర్‌ నాయనమ్మ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్‌, ఫ్యాన్లు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి కుటుంబానికి చెందిన ఆరుగురు మహిళలతో పాటు ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement