బాధితులకు న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం చేయండి

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

పుట్టపర్తి టౌన్‌: అర్జీలను చట్టపరిధిలో విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం స్థానిక పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై 80 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌ కుమార్‌ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని తెలిపారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని సిబ్బందిని ఆదేశించారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా, డీసీఆర్‌బీ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, లీగల్‌ అడ్వైజర్‌ సాయినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఐచర్‌ వాహనం ఢీకొని

వ్యక్తి దుర్మరణం

ముదిగుబ్బ: స్థానిక బైపాస్‌ రోడ్డులో సోమవారం రాత్రి ఐచర్‌ వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సదరు వ్యక్తి కొన్ని రోజులుగా ముదిగుబ్బ పరిసరాల్లో యాచన చేసుకుంటూ జీవనం సాగించేవాడు. బైపాస్‌ రోడ్డులో సోమవారం రాత్రి రోడ్డు పక్కన వెళ్తున్న అతన్ని ఓ ఐచర్‌ వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కేతన్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

పోలీసుస్టేషన్‌కు సూది పంచాయితీ!

కదిరి అర్బన్‌: వెనుక నుంచి సూది గుచ్చిందంటూ ఓ మహిళ మరో మహిళతో గొడవకు దిగింది. చివరికి ఈ పంచాయితీ పోలీసుస్టేషన్‌కు చేరింది. వివరాలు.. కదిరి పట్టణానికి చెందిన పక్కీరమ్మ సోమవారం ఆరోగ్యం బాగాలేకపోవడంతో బత్తలపల్లి ఆసుపత్రికి వెళ్లేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చింది. వెనక వైపు నుంచి సూదితో గుచ్చినట్లు అనిపించగా.. వెనకే ఉన్న మహిళ గుచ్చిందంటూ ఆమెతో వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బాబ్జాన్‌ వెంటనే అక్కడకు చేరుకుని ఇద్దరినీ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం పక్కీరమ్మను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఆమె శరీరంపై ఎటువంటి ఇంజెక్షన్‌ ఆనవాళ్లు లేవని తేలడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement