పుట్టపర్తి టౌన్: డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో స్థానిక గణేష్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ కొండయ్యకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నరసింహ మూర్తి మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మెగా డీఎస్సీ పేరున నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్ దగా చేసిందన్నారు. మెరిట్‌లిస్ట్ బహిరంగ పరచకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒక్కో పోస్టుకు రూ. లక్షల్లో బేరసారాలు జరిగాయన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడ్, పరీక్ష నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బంది పాత్రపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా పరిశీలకులు మిద్దె కుళ్లాయప్ప, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు మాతంగి తిప్పన్న, ఆంజనేయులు, చౌడప్ప, జిల్లా అధికార ప్రతినిధి ఫోటో సాయి, నాయకులు భాస్కర్, చిప్పప్ప, రామగిరి అనిల్, ఈశ్వర్, అజంతకిష్ట, చిన్నప్పయ్య, రంగనాథ్, రామయ్య, నరశింహులు, చందు, రామాంజి, గంగిశెట్టి, నారాయణస్వామి, ఓబుళేసు, నాగేంద్ర, శంకర్, గోపి, గంగాధర్, గోవిందప్ప, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి


