పుట్టపర్తి అర్బన్: ‘‘ఆయన జీవితమంతా అబద్ధాలు...మోసాలే. అధికారం కోసం ఎంతకై నా దిగజారుతారు. ఎవరితోనైనా జతకడతారు. నమ్మి ఓట్లేస్తే... అందరినీ నట్టేట ముంచుతారు’’ అని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సోమవారం పుట్టపర్తి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మేధావులు, పార్టీ శ్రేణులు, నాయకులతో కలిసి ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...రెండేళ్లలో దోచుకోవడమే తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచనే చేయలేదన్నారు. ఎన్నికల హామీలేవీ అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి మేధావులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేస్తున్నారన్నారు.
అమరావతి పేరుతో భారీ దోపిడీ
అక్కా చెల్లెమ్మలకు నెలకు రూ. 1,500, నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, విద్యార్థులకు వసతి దీవెన, వితంతువులకు పింఛన్, అన్నదాతలకు ఏడాదికి రూ.20 వేలు..అంటూ హామీలిచ్చిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. కానీ అమరావతికి రూ.వేల కోట్లు తగలేసేందుకు విచ్చల విడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. హామీలు అమలు చేయాలంటూ సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా జైల్లో పెట్టిస్తున్నారన్నారు. తన స్వార్థం కోసం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, విద్యా వ్యవస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేశారన్నారు. పేదలకు కొండంత అండనిచ్చే ఆరోగ్యశ్రీని అంపశయ్యపై పడుకోబెట్టారన్నారు. ఇక రైతులకు కనీసం విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వడం లేదన్నారు. యూరియా అడిగితే కేన్సర్ వస్తుందని భయపెడుతున్నారని మండి పడ్డారు.
జగన్ హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి
వైఎస్ జగన్ హయాంలోనే పుట్టపర్తి అభివృద్ధిలో దూసుకుపోయిందని శ్రీధర్‌రెడ్డి గుర్తుచేశారు. పుట్టపర్తిలో జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, 193 చెరువులకు నీళ్లిచ్చే కార్యక్రమం ప్రారంభం, నిరుపేదలకు జగనన్న కాలనీలు, నియోజకవర్గానికి 3 టీఎంసీల నికర జలాలు, మార్కెట్ యార్డు...ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో పుట్టపర్తికి పునరుజ్జీవం పోశారన్నారు. అలాగే పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి పేరుతో జిల్లా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరిగిందన్నారు. చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో చెప్పుకునేందుకు ఒక్క సంక్షేమ పథకామూ లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డి మామ పల్లె రఘునాథరెడ్డి పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టి అధికారులను, పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు సర్కార్‌తో ప్రజలు విసిగిపోయారన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. సమష్టిగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మన సత్తా చూపించాలన్నారు.
తెలంగాణ దాటని ప్యాకేజీ స్టార్
ప్రజలు ఓట్లేసి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కేలా చేస్తే...కృతజ్ఞత మరిచిన ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణకే పరిమితమయ్యారని శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏమైపోయినా ఆయన పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. ఆయనకు ప్యాకేజీ ఇస్తేనే రాష్ట్రానికి వచ్చి హడావుడి చేస్తారు తప్ప...ప్రజల కోసం కాదన్నారు. సుగాలి ప్రీతి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే పవన్‌కళ్యాణ్... సుగాలి ప్రీతి కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారన్నారు. ఇలాంటి నాయకుల్ని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
అబద్ధాలు...మోసాలు ఆయన నైజం
హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలకూ అన్యాయం
డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేసిన లోకేష్
ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ..?
పుట్టపర్తి రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి


