ధర్మవరం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలు వెల్లువెత్తాయి. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, రీసర్వేలో దొర్లిన తప్పులు సరిచేయాలని, తమ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, తమ గ్రామంలో నీటి సమస్య తీర్చాలని...ఇలా జనం తమ సమస్యలను ఏకరు పెట్టారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ భవనంలో సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కలెక్టర్ శ్యాంప్రసాద్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రి, కలెక్టర్‌లకు అందించారు. నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలోనే ఏకంగా 132 అర్జీలు అందడం గమనార్హం. అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించామని, సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి, కలెక్టర్‌లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జిల్లాస్థాయి అధికారులు, నియోజకవర్గ అధికారులు పాల్గొన్నారు.
అందిన అర్జీల్లో కొన్ని ఇలా...
మృతి చెందిన, పదవీ విరమణ పొందిన మున్సిపల్ కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్‌ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, నాయకులు జేవీ రమణ, మున్సిపల్ కార్మికులు మేకల బాబు, ముకుంద, లక్ష్మీ ఓబిలేసు మంత్రి, కలెక్టర్‌లకు వినతిపత్రాలు అందించారు. ధర్మవరం మన్సిపాలిటీలోని కార్మికుల సంఖ్యను 120కి పెంచాలన్నారు.
● తుంపర్తి కాలనీలో ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ రేషన్ షాపు, తాగునీటి సదుపాయం, ఆరోగ్య సేవలు, మౌలిక వసతులు కల్పించాలని ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర నాయకుడు మంజుల నరేంద్ర మంత్రికి విన్నవించారు.
● ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ శాఖల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్నారని, దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సాకే వినయ్‌కుమార్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికారులను నియమించి ఇన్‌చార్జ్‌ల పాలనకు ముగింపు పలకాలని కోరారు.
● చేనేత కార్మికులకు నేతన్న భరోసా రూ.25 వేలు అమలు చేయాలని, తిరుపతిలో ఉన్న ఆర్‌డీడీ కార్యాలయాన్ని ధర్మవరంలో ఏర్పాటు చేయాలని, అప్పుడే చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుందని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, పట్టణ కార్యదర్శి రవికుమార్ తదితరులు మంత్రికి విన్నవించారు.
వివిధ సమస్యలపై 132 వినతులు


