ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించండి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించండి

Jun 9 2026 9:04 AM | Updated on Jun 9 2026 9:04 AM

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

ప్రశాంతి నిలయం: ‘‘వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉంది. అందువల్ల ఎల్‌నినో పరిస్థితులను తట్టుకునే విధంగా అంతర పంటల సాగు (వేరుశనగ, కంది)తో పాటు తక్కువ నీటితో పండే జొన్న, కొర్ర, సజ్జ, పెసర లాంటి ప్రత్యామ్నాయ పంటలు రైతులు సాగుచేసేలా ప్రోత్సహించండి.’’ అని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తన ఛాంబర్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఈ ఏడాది జిల్లా వ్యవసాయ స్థూల విలువ లక్ష్యం రూ.1301.04 కోట్లుగా నిర్దేశించామన్నారు. ఉత్పాదకతలో గత ఏడాది కంటే కనీసం 10 శాతం వృద్ధి సాధించేలా లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. ఖరీఫ్‌లో 1,97,518 హెక్టార్లలో పంటల సాగును ప్రతిపాదించామన్నారు. జిల్లాకు 42,351 టన్నుల ఎరువులు అవసరమవుతాయన్నారు. తొలకర్లు కురుస్తున్న నేపథ్యంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కింద 2,65,040 మంది రైతులకు రూ.371.06 కోట్లు, పీఎం కిసాన్‌ కింద 2,46,262 మంది రైతులకు రూ.147.76 కోట్లు మంజూరయ్యాయన్నారు. అర్హులై ఉండి పథకం అందని రైతుల సాంకేతిక సమస్యలు తొలగించి లబ్ధి చేకూర్చాలన్నారు. సమావేశంలో మార్క్‌ఫెడ్‌ డీఎం గీత, డీఏఓ నారాయణనాయక్‌, ఏపీ సీడ్స్‌ డీఎం సుబ్బయ్య, సైంటిస్ట్‌లు బాలాజీ నాయక్‌, రామసుబ్బయ్య, ఏడీఏలు పాల్గొన్నారు.

డిగ్రీ ఫలితాల విడుదలకు కసరత్తు

అనంతపురం: ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్‌ ఫలితాల విడుదలకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. జనవరిలో పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల వెల్లడిలో జాప్యం నెలకొనడంపై 13 వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుండటంపై ‘అంతా మా ఇష్టం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్‌ జ్యోతికుమార్‌ స్పందించారు. సోమవారం పరీక్షల విభాగం అధికారులతో కలిసి ఆన్‌లైన్‌ నిర్వహణ సంస్థతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. సక్రమమైన డేటాను ఇవ్వడంలో పరీక్షల విభాగం ఉన్నతాధికారులు విఫలమయ్యారని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. డేటా అందిస్తే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు.

ప్రొఫెసర్‌ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు

అనంతపురం: జేఎన్‌టీయూ(ఏ) ఎస్కేయూ పరిధిలోని అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ నెల 8న దరఖాస్తు గడువు ముగియగా.. దాన్ని 15 వరకు పొడిగిస్తూ యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు https:// apuniversitiesrecruitment. apcfss. in లో తెలుసుకోవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement