లేపాక్షి: లేపాక్షి వీరభద్రస్వామిని ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ ప్రభాకర్ శాస్త్రి దర్శించుకున్నారు. దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో సంప్రదాయం ప్రకారం జస్టిస్ ప్రభాకర్ శాస్త్రిని శాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
ఖతార్‌లో నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు
ప్రశాంతినిలయం: ఖతార్ దేశంలోని దోహా నగరంలో హోంకేర్ నర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి కళ్యాణి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 9 నుంచి 10 లోపు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయని, ఎంపికై న వారికి నెలకు రూ.5 వేల ఖతారీ రియాల్స్ (భారత కరెన్సీ ప్రకారం రూ.1,30,000) వేతనం ఉంటుందన్నారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం నర్సింగ్‌తో పాటు రెండేళ్లు పోస్ట్ రిజిస్ట్రేషన్ అనుభవం కలిగిన పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వసతి, వైద్య సదుపాయం, రవాణా, వీసా, విమాన ఖర్చులు ఉచితమన్నారు. ఇతర వివరాలకు 9988853335, 8790117279 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
చేనేత కార్మికుడి ఆత్మహత్య
గార్లదిన్నె: అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కల్లూరుకు చెందిన రమేష్ (42) చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. మగ్గం నిర్వహణ.. కుటుంబ అవసరాల కోసం ఇతరుల వద్ద రూ.7 లక్షల దాకా అప్పులు చేశాడు. అయితే వచ్చే సంపాదన కుటుంబ పోషణకే సరిపోతోంది. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో రోజూ మదనపడుతుండేవాడు. ఈ క్రమంలో రమేష్ ఈ నెల మూడో తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. అయినా కోలుకోలేకపోయాడు. శనివారం రాత్రి మృతి చెందాడు. రమేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా పేర్కొన్నారు.


