ఫేక్‌ ఫోన్‌ పే మెసేజ్‌తో మోసం | - | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ఫోన్‌ పే మెసేజ్‌తో మోసం

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

బియ్యంతో ఉడాయించిన మోసగాడు

హిందూపురం టౌన్‌: ఓ బియ్యం దుకాణంలో బియ్యం ప్యాకెట్లు కొని డబ్బులు చెల్లించకుండా ఉడాయించాడు ఓ మోసగాడు. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు... స్థానిక ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ బియ్యం దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం బియ్యం కొనుగోలు చేయడానికి వచ్చాడు. రూ.10 వేల విలువైన బియ్యం ప్యాకెట్లు కొనుగోలు చేసిన తర్వాత సెల్‌ నంబర్‌: 8310220463 నుంచి డబ్బను ఫోన్‌ పే ద్వారా చెల్లిస్తానని నమ్మబలిగాడు. అనంతరం ఫోన్‌ పే చేసినట్లు చూపిస్తూ సక్సెస్‌ ఫుల్‌ అనే మెసేజ్‌ను క్రియేట్‌ చేసుకుని ఫోన్‌ స్క్రీన్‌ పైన చూపించాడు. హడావుడిలో ఉన్న దుకాణాదారుడు దాన్ని నమ్మి ఆ మోసగాడికి బియ్యం ప్యాకెట్లను అప్పచెప్పాడు. చాలా ఆలస్యంగా రూ.10 వేలు తన ఖాతాకు పడలేదన్న విషయాన్ని దుకాణదారుడు గుర్తించాడు. సదరు వ్యక్తికి ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో తాను మోసపోయానని తెలుసుకున్నాడు

సైబీరియన్‌ పక్షులను వీక్షించిన జేసీ

చిలమత్తూరు: మండల పరిధిలోని వీరాపురంలో సైబీరియన్‌ పక్షులను వీక్షించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదివారం వీరాపురం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పక్షులకు ఆయన కెమెరాలో బంధించారు. అనంతరం పక్షుల సంరక్షణ, నీరు, ఆహారం వంటివి ఎలా సమకూర్చుకుంటున్నాయో గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. వేసవి నేపథ్యంలో నీరు, ఆహారం కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ లక్ష్మీపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైలు కింద పడి

వృద్ధుడి ఆత్మహత్య

ధర్మవరం: పట్టణంలోని పోతుకుంట రైల్వే బ్రిడ్జి కింద రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హిందూపురం రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ఎర్రిస్వామి వివరాల మేరకు... పట్టణంలోని పోతుకుంట రైల్వే బ్రిడ్జి కింద ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వృద్ధుడు (70) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వద్ద కట్టెల బ్యాగు అందులో రెండు జతల తెల్ల షర్టులు, తెల్ల పంచె, తెల్ల టవాల్‌ ఉన్నాయన్నారు. రైల్వే కీమాన్‌ సమాచారం మేరకు శవాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. ఎవరైనా మృతి చెందిన వృద్ధుడి గుర్తిస్తే రైల్వే పోలీసులు 9182019510, 9247575615, 9247575612 నంబర్లకు సమాచారం తెలియజేయాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

గోరంట్ల: మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో కదిరి–హిందూపురం ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కదిరికి చెందిన నాగేంద్ర (23) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కదిరి పట్టణానికి చెందిన నాగేంద్ర పాలసముద్రం సమీపంలోని కియా అనుబంధ సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు. పని ముగించుకొని ద్విచక్ర వాహనంలో గోరంట్ల వైపు వస్తుండగా పాలసముద్రం సమీపంలోని పెట్రోల్‌ బంకు మలుపు వద్ద గోరంట్ల నుంచి హిందూపురం వైపు వెళ్తున్న ఆర్‌టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

లారీ ఢీ కొని యువకుడు..

హిందూపురం: తూమకుంట పారిశ్రామికవాడ చెక్‌పోస్టు వద్ద వేగంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాలమేరకు... కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలుకాకు చెందిన నరసింహప్ప (38) ఆదివారం ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా తూమకుంట పారిశ్రామికవాడ చెక్‌పోస్టు వద్ద వెనుక వైపు నుంచి లారీ ఢీ కొంది. ఘటనలో నరసింహప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement