కదిరి టౌన్: ఎన్నికల ముందు అలివికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తరువాత హామీలు అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశారని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ విమర్శించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ... పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వెన్నుపోటు.. ఆయనకు వెన్నతోపెట్టిన విద్యన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా కొత్త పింఛన్లు, నిరుద్యోగ భృతి, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలకు నెలకు రూ.1500 ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. అధికారం వచ్చిన తర్వాత అక్రమాలు, అక్రమ అరెస్టులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు మీరు చేసిన అక్రమాలకు వడ్డీతో సహా చెల్లిస్తారన్నారు. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా బ్లాక్ బెలూన్లను ఎగరవేసి నిరసన తెలిపారు. అలాగే పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో తెలియజేసీ చిత్రాలను ప్రదర్శించారు.
12న ర్యాలీని జయప్రదం చేయండి
వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న కదిరిలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీఎస్ మక్బూల్ తెలిపారు. బాలుర కాలేజ్ గ్రాండ్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి, సీనియర్ నాయకులు కుర్లి శివారెడ్డి, పట్టణాధ్యక్షడు షేక్ బాబ్జాన్, మండల కన్వీనర్లు డీకే బాబు (కృష్ణారెడ్డి), మణికంఠనాయక్, రవికుమార్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, రంగారెడ్డి, అశోక్‌వర్ధన్‌రెడ్డి, ఎంపీపీ అమర్‌నాథ్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి లింగాల మధుసూదన్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి జైనుల్లా, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు.
12న కదిరిలో జరిగే ర్యాలీని
జయప్రదం చేయండి
వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకర్గ
సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్


