లేపాక్షికి బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

లేపాక్షికి బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం కల్పించాలి

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

లేపాక్షి: జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయానికి లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం కల్పించాలని నిర్వాహకులకు విన్నవించినట్లు చరిత్రకారుడు, పర్యాటరంగ నిపుణుడు మైనాస్వామి వెల్లడించారు. శనివారం సాయంత్రం స్థానిక ఏపీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయ సముదాయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడానికి అన్ని అర్హతలున్నాయని పేర్కొన్నారు. మూడు అంగుళాల సూక్ష్మ శిల్పం నుంచి 12 అడుగుల పెద్ద శిల్పం వరకు ఉన్న శిల్పాలు, ఆసియా దేశాల్లోకెల్లా పెద్దదైన వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం, నేలను తాకని ఆకాశ స్తంభం, అతిపెద్ద నంది విగ్రహం, 33 అడగుల పొడువు 20 అడుగుల ఎత్తు గల నంది విగ్రహం లేపాక్షి ప్రత్యేకతలను చాటుతున్నాయని చెప్పారు. బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ స్థానిక నిర్వాహకులకు విషయం తెలుపగా త్వరలో వారు లేపాక్షిని సందర్శించి అన్ని విషయాలను నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు రావడం ద్వారా పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి ఈ ప్రాంతం ఆర్థిక, ఉపాధి అవకాశాలు ఎంతగానో మెరుగుపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ధర్మవరం రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో సోదాలు

ధర్మవరం రూరల్‌: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం టూటౌన్‌ సీఐ రెడ్డప్ప తన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాలల్లో సోదాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే సోమందేపల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన దీవెన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి ప్రత్యేక టెస్టింగ్‌ కిట్‌ ద్వారా పరీక్ష నిర్వహించగా గంజాయి వినియోగించినట్లు తేలిందని సీఐ తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని ఆయన సూచించారు.

ఇరు వర్గాల ఘర్షణ

నార్పల: భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. మండలంలోని బండ్లపల్లిలో నివాసముంటున్న నారాయణరెడ్డికి నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. నాగభూషణరెడ్డి, సాయి భూషణ్‌రెడ్డి అన్నదమ్ములు. కాగా.. వీరికి ఆరెకరాలకు పైగా భూమి ఉంది. ఇటీవల జరిగిన రీ సర్వేలో నారాయణరెడ్డికి చెందిన 44 సెంట్ల భూమి నాగభూషణ్‌రెడ్డి పేరిట నమోదైంది. భూమిలో దుక్కులు చేసేందుకు నాగభూషణ్‌రెడ్డి ప్రయత్నించడంతో అది తన భూమి అంటూ నారాయణరెడ్డి, ఆయన కుటుంబీకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ముగిసిన బీసీసీఐ శిక్షణ

అనంతపురం: బీసీసీఐ (సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) అండర్‌–16 టీమ్‌ సీ కోచింగ్‌ క్యాంప్‌ శనివారం ముగిసింది. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మే 11 నుంచి జూన్‌ 06వ తేదీ వరకు రెసిడెన్షియల్‌ శిక్షణ కల్పించారు. హెడ్‌ కోచ్‌ హిమ్‌ జోషిపుర, ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌ రొనాల్డ్‌ రాయ్‌ రోడ్రిజియస్‌, ఫిజియోథెరఫిస్ట్‌ మేఘాన్‌ సింఘ్‌ చౌహాన్‌, వైభవ్‌ గోసామి, అనుష్క ఆదిత్య, అనలిస్ట్‌ కలై సెల్వన్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి యోగాంధ్ర ప్రచారం

ప్రశాంతి నిలయం: యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఆదివారం నుంచి 21వ తేదీ వరకూ యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రజల్లో యోగాపై అవగాహన కల్పించి ప్రజల ఆరోగ్యం, శేయస్సు పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. యోగా మాసంలో జూనియర్స్‌, సీనియర్స్‌, యువతకు సోలో యోగా, ప్రాణాయామం, గ్రూప్‌ యోగా, యోగా క్విజ్‌, స్లోగన్‌, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి పోటీలు 7 నుంచి 9 వరకూ, మండలస్థాయి పోటీలు 10 నుంచి 12 వరకూ, జిల్లా స్థాయి పోటీలు 14 నుంచి 16 వరకూ, రాష్ట్రస్థాయి పోటీలు 18 నుంచి 20 వరకూ వివిధ పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు, పట్టణాల్లో 5 వార్డులకు ఒకరిని మాస్టర్‌ ట్రైనర్లుగా గుర్తించి సిద్ధం చేసి యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement