ధర్మవరం: సీఎం చంద్రబాబు అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం దివాలా తీస్తోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పలువురు మేధావులు, విద్యార్థి సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఇందుకోసం ప్రజలంతా సంఘటితమై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న వైనంపై చర్చించేందుకు శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వివిధ పార్టీల నాయకులు, మేధావులు, కుల సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. తొలుత బీఎస్పీ నుంచి సాకే వినయ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ నుంచి నామాల నాగార్జున, ఏఐవైఎఫ్ నుంచి సకల రాజ, ఆర్‌ఎస్‌పీ నుంచి మంజుల నరేంద్ర, ఏఐబీఎఫ్ నుంచి పోతలయ్య, వైఎస్సార్ విద్యార్థి విభాగం నుంచి అమర్‌నాథ్‌రెడ్డి, ఐటీ వింగ్ నుంచి తిప్పేపల్లి కళ్యాణ్‌రెడ్డి, లోకేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నుంచి దేవరకొండ రమేష్, చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, పెద్దిరెడ్డిగారి శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. అధికారమే పరమావధిగా ఎన్నికల వేళ చంద్రబాబు అలవిగాని హామీలిచ్చారన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క హామీని సరిగా అమలు చేయలేదని మండిపడ్డారు. రెండేళ్లుగా ప్రకృతి సహకరించక కరువు తాండవిస్తోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు ఉద్యోగ అవకాశాలు లేక యువత దిక్కుతోచని స్థితిలో పడిందన్నారు. అయినా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. పేదవారికి గతంలో మాదిరిగా నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు.
అన్నివర్గాలకూ మోసం..
ఎన్నికలకు ముందు ‘సూపర్‌సిక్స్’ పథకాలతో ప్రజలకు ఆశలు చూపిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి ఇంతవరకూ అమలు చేయలేదన్నారు. నిరుద్యోగ యువతకు ప్రతినెల రూ.3 వేలు భృతికీ మంగళం పాడారన్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు...గతంలో ఉన్న పింఛన్లను తొలగించి పేదలకు అన్యాయం చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు అంటూ ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకుండా చేశారన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రచారానికే పరిమితయ్యాయని మండిపడ్డారు. కీలకమైన అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.40 వేలు ప్రతి రైతుకు ఇస్తామని చెప్పిన చంద్రబాబు... అందులో సగం కూడా ఇచ్చిన పాపన పోలేదన్నారు. చంద్రబాబు పాలన అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారగా... రెండేళ్లలోనే రాష్ట్రం 3 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలైందని దుయ్యబట్టారు. మెగా డీఎస్సీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచి ఒక్కో ఉద్యోగాన్ని రూ.20 లక్షలకు అమ్ముకున్న నీచ ప్రభుత్వం చంద్రబాబుదని మండిపడ్డారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మోసపూరిత పాలనపై ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే నినాదంతో ఈనెల 12న ధర్మవరంలో నిరసన కార్యక్రమం చేపట్టామని, పార్టీలకతీతంగా ప్రజలందరూ తరలిరావాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలి
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఉనికి కోల్పోయిన విద్యారంగానికి చేయూత ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు అందించి పేద విద్యార్థులను ఆదుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలి, లేకపోతే తక్షణం నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
– నామాల నాగార్జున, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
ప్రజలంతా సంఘటితం కావాలి
సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు. అభివృద్ధి పేరుతో అమరావతిలో సంపదను తన వారికే దోచి పెట్టి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు. చంద్రబాబు అవినీతి విధానాలు, ఎన్నికల హామీల అమలు కోసం అందరం కలసి సంఘటితమై పోరాటం చేద్దాం.
– సాకే వినయ్ కుమార్, బీఎస్పీ నాయకుడు
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం
చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. మెగా డీఎస్సీలోనూ ఉద్యోగాలు అమ్ముకున్నారు. చంద్రబాబు మోసంపై రాష్ట్ర వ్యాప్త పోరాటానికి శ్రీకారం చుడుతాం.
– అమర్‌నాథ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి,
వైఎస్సార్ విద్యార్థి విభాగం
సంక్షేమ పథకాలకు మంగళం..
దోపిడీకి శ్రీకారం
ఎన్నికల హామీలన్నీ విస్మరించి
దారుణ మోసం
ఆర్థిక మాంద్యంతో
నరకం చూస్తున్న జనం
చంద్రబాబు హామీల అమలు కోసం
ప్రజలందరూ సంఘటితం కావాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, మేధావుల పిలుపు
12న ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ
ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం


