12 మండలాల్లో వర్షం | - | Sakshi
Sakshi News home page

12 మండలాల్లో వర్షం

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

పుట్టపర్తి అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ 12 మండలాల పరిధిలో వర్షం కురిసింది. పుట్టపర్తి మండలంలో అత్యధికంగా 18.6 మి.మీ, రొళ్ల మండలంలో 15.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే నల్లమాడ మండలంలో 11.2 మి.మీ., పెనుకొండ 7.4, ధర్మవరం 7.2, హిందూపురం 6.4, సోమందేపల్లి 4.2, అమరాపురం 3.4, రామగిరి 3.2, తలుపుల 2.0, గాండ్లపెంట 2.0, కదిరి మండలంలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 12 మండలాల పరిధిలో ఒక్కరోజే 82.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఎఫ్‌పీఓలను

బలోపేతం చేయాలి

ప్రశాంతి నిలయం: రైతు ఉత్పత్తి దారుల సంఘాలను(ఎఫ్‌పీఓలు) ఆర్థికంగా బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఎఫ్‌పీఓ జిల్లా మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఎఫ్‌పీఓల ప్రస్తుత పరిస్థితి, వ్యాపార విస్తరణ, రైతులకు అందుతున్న సేవలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యక్రమాలతో ఎఫ్‌పీఓలను అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. సమావేశంలో డీఏఓ నారాయణ నాయక్‌, బ్యాంకు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఎఫ్‌పీఓల సీఈఓలు పాల్గొన్నారు.

పాలిటెక్నిక్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

రామగిరి: స్థానిక వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాల (2026–27 విద్యా సంవత్సరం) దరఖాస్తు గడువును ఈనెల 22వ తేదీ వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రవేశాల వివరాలకోసం 9391878837, 9885527674 నంబర్లలో సంప్రదించాలన్నారు.

జేసీ ప్రభాకర్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తరచూ నోటికొచ్చినట్లు మాట్లాడే టీడీపీ నేత, తాడిపత్రి మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బయటకు వస్తే తరిమికొట్టాలని టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ పల్లెల్లో గొడవలకు ఆజ్యం పోసేలా మాట్లాడారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామంలో శనివారం టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో జేసీ మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోటా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారులు పోటీ చేయాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారని, అయితే తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం అలా పోటీ చేయనిచ్చే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జెండా పట్టుకొని వస్తే టీడీపీ కార్యకర్తలు ఊరుకోరన్నారు. పెద్దవడుగూరు మండలంలోని వైఎస్సార్‌సీపీ నేతలు గూడూరు సూర్యనారాయణరెడ్డి, ఎద్దుల శరభారెడ్డి, భీమునిపల్లి రామచంద్రారెడ్డి, మేడిమాకులపల్లి చితంబరరెడ్డిలను తరిమికొట్టాలని టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. వారు ఎన్నికల్లో కలుగజేసుకోకుండా భయపెట్టాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement