కలెక్టర్‌ ‘ఉత్త’ర్వులు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ‘ఉత్త’ర్వులు

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

తహసీల్దార్‌ బదిలీల్లో ‘పచ్చ’ మంత్రాంగం

విధుల్లో చేరకముందే మండలాలు మార్పు

పుట్టపర్తి అర్బన్‌: కలెక్టర్‌.. జిల్లా మెజిస్ట్రేట్‌... పాలనలో కీలక పాత్ర. ఆయన ఒకసారి ఉత్తర్వులు ఇచ్చారంటే అది శాసనమే. కానీ ఇటీవల జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులన్నీ ఉత్తవిగా మారిపోతున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం పలువురు తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇస్తూ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఉత్తర్వులు ఇచ్చారు. పుట్టపర్తి తహసీల్దార్‌గా త్రిభువన్‌రెడ్డిని, కొత్తచెరువు తహసీల్దార్‌గా సంహితను నియమించారు. ఏమైందో ఏమో గానీ.. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ‘పచ్చ’ మంత్రాంగం నడిచింది. దీంతో పుట్టపర్తి తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకోవాల్సిన త్రిభువన్‌రెడ్డిని కొత్తచెరువుకు, కొత్తచెరువులో బాధ్యతలు తీసుకోవాల్సిన సంహితను పుట్టపర్తికి మార్చారు. దీంతో శనివారం ఆమె పుట్టపర్తి తహసీల్దార్‌గా బాధ్యతలు కూడా తీసుకున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి వస్తున్న త్రిభువన్‌రెడ్డి తమ మాట వింటారో లేదో అని సందేహ పడిన స్థానిక ఎమ్మెల్యే... ఆయన్ను కొత్తచెరువుకు పంపించి.. డీఎస్‌ఓ కార్యాలయంలో సీఎస్‌డీటీగా విధులు నిర్వర్తిస్తున్న సంహితను పుట్టపర్తికి బదిలీ చేయించారని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి.

లావాదేవీలకు ఇబ్బందులు రాకూడదనే!

పుట్టపర్తి.. జిల్లా కేంద్రం. అందువల్ల ఇక్కడ తహసీల్దార్‌ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మండలంలో ఏపీఐఐసీకి భూముల కేటాయింపు, డబ్బు లావాదేవీలు భారీగా చేయాల్సి ఉంది. ఆయా వ్యవహారాల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా తమకు అనుకూలమైన వారిని నియమించుకోవడంలో ఎమ్మెల్యే విజయం సాధించారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

‘ప్రొటోకాల్‌’ విధులతో సమస్య..

పుట్టపర్తికి దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు, రాష్ట్ర ప్రముఖులు, మంత్రులు తరచూ విచ్చేస్తుంటారు. దీంతో ఇక్కడి తహసీల్దార్‌, ఆర్డీఓలకు ప్రొటోకాల్‌ విధులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం పుట్టపర్తిలో ఆర్డీఓగా మహిళాధికారి ఉన్నారు. తహసీల్దార్‌గా కూడా మహిళను నియమిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని కలెక్టరేట్‌ అధికారులే చెబుతున్నారు. కొన్ని సమయాల్లో రాత్రి వేళల్లో ప్రముఖులు విచ్చేస్తారని, వారికి స్వాగతం పలికేందుకు ఆ సమయంలో వేచి ఉండాల్సి ఉంటుందంటున్నారు. అందువల్ల తహసీల్దార్‌గా మహిళ కంటే పురుషులనే నియమిస్తే బాగుండేదని కలెక్టరేట్‌ సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం ఆర్డీఓ, తహసీల్దార్‌ ఇద్దరూ మహిళలే కావడంతో ప్రొటోకాల్‌ బాధ్యతలన్నీ తమపై పడతాయంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement