పుట్టపర్తి అర్బన్: వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలన్నీ పుస్తకాలు, యూనిఫాం అంటూ హడావుడి చేస్తున్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఎక్కడా ఆ సందడి కనిపించడం లేదు. పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, సామగ్రి, యూనిఫాం అందిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ గొప్పలు చెప్పినా...అవన్నీ నీటిమూటలేనని తెలుస్తోంది. ఇప్పటివరకూ తొలి విడతలో కేవలం కొన్ని పుస్తకాలు పంపిన ప్రభుత్వం... యూనిఫాం, షూ తదితర వాటి గురించి నోరెత్తడం లేదు. దీంతో పేద పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. గత ప్రభుత్వంలో అన్నింటినీ ఒకే సారి విద్యార్థులకు అందజేయడంతో మొదటి రోజే ఆనందంగా పాఠశాలలకు వచ్చి సంతోషంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్, యూనిఫారం, షూ తీసుకెళ్లేవారు. ఈసారి మాత్రం అన్నీ ప్రైవేటుగా కొనాల్సిన దుస్థితి నెలకొంది.
అరకొరగా పుస్తకాల సరఫరా..
జిల్లాలోని 32 మండలాల్లో 2012 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో 1,22,836 మంది విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్నారు. వీరిలో 1, 2 తరగతుల విద్యార్థులకు మూడేసి పాఠ్య పుస్తకాల చొప్పున 52,269 పుస్తకాలు, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు 5 పాఠ్య పుస్తకాల చొప్పున 1,61,750 పుస్తకాలు, 6, 7 తరగతుల విద్యార్థులకు 6 పుస్తకాల చొప్పున 1,48,560 పుస్తకాలు, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 7 పుస్తకాల చొప్పున 3, 38, 121 పుస్తకాలు కలిపి మొత్తంగా 7,00,700 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. వీటితో పాటు 6 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. మూడు విడతలుగా వచ్చే పుస్తకాల్లో ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా అరకొరగా పుస్తకాలు పంపారు. దీంతో వాటన్నింటినీ ఎమ్మార్సీలకు చేర్చారు.
జగన్ హయాంలో తొలిరోజే ‘విద్యాకానుక’
గత జగన్ సర్కార్ పాఠశాల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్ అందించేది. అందులో పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, వర్క్‌బుక్కులు, మూడు జతల యూనిఫాం, స్కూల్ బ్యాగ్, జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టులు ఉండేవి. అలాగే యూనిఫాం కుట్టుకూలి కూడా ప్రభుత్వమే చెల్లించేది. ఇక 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ ఇచ్చేవారు. నెలరోజుల ముందుగానే విద్యార్థుల పాదాల కొలతలు తీసుకుని అందుకు తగ్గట్టుగా షూ పంపేవారు. దీంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడేదికాదు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం...పాఠ్య పుస్తకాలను సైతం సరిగా పంపడం లేదు. రెండేళ్లుగా యూనిఫాం కుట్టు కూలీ డబ్బు కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయడం లేదు. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వారం రోజుల్లో పాఠశాలలు
పునఃప్రారంభం
నేటికీ పాఠశాలలకు
పూర్తిస్థాయిలో చేరని పుస్తకాలు
మొదటి విడతలో సగం కూడా
సరఫరా కాని వైనం
యూనిఫాం, షూ మాటే ఎత్తని సర్కార్


