పుట్టపర్తి టౌన్: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పుట్టపర్తి సమీపంలోని ఎద్దుల కొండలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం పుట్టపర్తి విద్యాగిరి ఆర్చ్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించి ‘మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం’’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా 159 ప్రాంతాల్లో 40 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సామాజిక వన విభాగంలో భాగంగా పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లోని కొండల్లో 40 వేల సీడ్‌బాల్స్ వేసినట్లు వెల్లడించారు. చెట్లను మనం రక్షిస్తే... చెట్లు మనలను కాపాడుతాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి హరిత పుట్టపర్తిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ చక్రపాణి, డివిజనల్ అటవీ అధికారి శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
యోగా ఏర్పాట్ల పరిశీలన..
లేపాక్షి: స్థానిక వీరభద్రస్వామి దేవాలయ ఆవరణలో ఈనెల 7 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న యోగా తరగతుల ఏర్పాట్లను కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. యోగా శిక్షణకు వచ్చే వారి వాహనాల కోసం ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. యోగా తరగతులు నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 7వ తేదీ జరిగే యోగా తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు స్టేజీని సిద్ధం చేయాలన్నారు. శిక్షకులకు, యోగాభ్యాసకులకు అనుకూల వాతావరణం నెలకొల్పాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీఎఫ్‌ఓ, మండల స్పెషల్ ఆఫీసర్ చక్రపాణి, తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసులు, రూరల్ సీఐ జనార్దన్, ఎస్‌ఐ నరేంద్ర, టూరిజం, దేవదాయ, పురావస్తు, రెవెన్యూ శాఖల సిబ్బంది ఉన్నారు.
సమష్టి కృషితోనే ‘హరిత పుట్టపర్తి’ సాధ్యం
కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్
వసతి గృహాలు పచ్చదనంతో
కళకళలాడాలి
గోరంట్ల: జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల ఆవరణలో వీలైనన్ని మొక్కలు నాటి పచ్చదనంతో కళకళలాడేలా చూడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన... అధికారులతో కలిసి స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహం ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యత పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి రెడ్డి బాలాజీ, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ జిల్లా అధికారి మోహన్‌రామ్, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


