ఎస్‌ఐఆర్‌ను పక్కాగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ను పక్కాగా చేపట్టాలి

Jun 6 2026 12:23 AM | Updated on Jun 6 2026 12:23 AM

ప్రశాంతినిలయం: జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)–2026ను పక్కాగా చేపట్టాలని జేసీ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితాల ప్రాధాన్యత, సవరణ, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఎస్‌ఐఆర్‌ ద్వారా ప్రతి పౌరుడూ ఓటరు జాబితాలో నమోదు కావాలన్నారు. మరణించిన వారు, వలస వెళ్లిన వారు, రెండు చోట్ల నమోదులు తదితర వాటిని గుర్తించి కచ్చితమైన ఓటరు జాబితా తయారు చేయాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటరు నమోదు, తొలగింపు, సవరణలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, ఫారాల నిర్వహణ ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య, ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు.

ట్రాన్స్‌జెండర్‌ మృత్యువాత

కదిరి టౌన్‌: ఆటో, బొలెరో ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ ట్రాన్స్‌జెండర్‌ మృతి చెందిన ఘటన కదిరి ఆర్టీఓ కార్యాలయ సమీపంలో జరిగింది. శుక్రవారం కదిరికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ షామీర్‌ (21), మరో ఐదుగురు ఆటోలో అనంతపురం వైపు బయలుదేరారు. కుటాగుళ్ల వద్ద ఆర్టీఓ కార్యాలయ సమీపంలో ఆటోను బొలెరో వాహనం ఎదు రుగా ఢీకొంది. తీవ్ర రక్తగాయాలైన షామీర్‌ను వెంటనే కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు.

బాధ్యతల స్వీకరణ

అనంతపురం కల్చరల్‌: ఉమ్మడి జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా జీవిగారి శివప్రసాద్‌ శుక్రవారం స్థానిక గ్రంథాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వడ్డే వెంకట్‌, కమ్మన్న, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతాపరెడ్డి, జయరామ్‌ తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌ మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సెస్సు వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. అధికారులు, సిబ్బంది ఒకేతాటిపై నిలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.

● తాత్కాలిక (ఎఫ్‌ఏసీ) కార్యదర్శిగా సేవలందించిన కమ్మన్నను రవికుమార్‌ నాయుడు, రామాంజనేయులు, గోవిందు, రాజు, రామాంజనమ్మ తదితరులు సన్మానించారు.

విద్యుత్‌ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి

గుత్తి: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌ఎస్‌ పల్లికి చెందిన రామాంజనేయులు (38) అలియాస్‌ రామన్న విద్యుత్‌ స్తంభం నుంచి జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌ఎస్‌ పల్లికి చెందిన రామాంజనేయులు ప్రైవేట్‌ విద్యుత్‌ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పెద్దవడుగూరు మండలం జీ–వెంకటాం పల్లిలోని ఓ పొలంలో విద్యుత్‌ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్‌కు గురై కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన రామాంజనేయులును గుత్తి ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మచ్చుకత్తితో వ్యక్తి వీరంగం

డీ హీరేహాళ్‌ (రాయదుర్గం): డీ హీరేహాళ్‌ మండలంలోని మురడిలో వీరేష్‌రెడ్డి అనే వ్యక్తి మచ్చుకత్తితో వీరంగం సృష్టించాడు. వివరాలు.. గురువారం రాత్రి గ్రామానికి చెందిన నాగరాజురెడ్డి, వీరేష్‌రెడ్డి మధ్య స్థలం విషయంపై ఘర్షణ జరిగింది. స్థానికుడు నరసింహారెడ్డి జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. వీరేష్‌రెడ్డి రాయితో దాడి చేసేందుకు యత్నించాడు. స్థానికులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే, చీకటి పడ్డాక తప్పతాగి వచ్చిన వీరేష్‌ రెడ్డి మచ్చు కొడవలి పట్టుకుని బీభత్సం సృష్టించాడు. ‘మీ అంతుచూస్తా..ఈ రోజు నరికే వెళతా’నంటూ హల్‌చల్‌ చేశాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డీ హీరేహాళ్‌ ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి గ్రామానికి చేరుకుని విచారించారు. వీరేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement