కదిరి అర్బన్: వారంతా ఏళ్ల పాటు ఆర్టీసీలో పనిచేశారు. చిత్తశుద్ధితో సేవలందించారు. అలాంటి వారు పదవీ విరమణ చేశాక ఇబ్బందులు లేకుండా చూడాల్సిన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. అదనపు ప్రయోజనాలు అందించకుండా చుక్కలు చూపుతోంది. వివరాలు.. ఆర్టీసీలో పనిచేసే సమయంలో అనారోగ్యం బారిన పడడంతో పలువురు పదవీ విరమణ పొందారు. ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా ఇలాంటి వారు దాదాపు 120 మంది ఉన్నారు. చాలా ఏళ్ల క్రితమే రిటైర్మెంట్ పొందినా ‘అదనపు ప్రయోజనాలు’ అందకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల్లో 30 మంది వరకూ ఇప్పటికే మరణించడం గమనార్హం.
జాప్యం.. శాపం
మానిటరీ బెనిఫిట్ అందిస్తామంటూ ఇటీవల ప్రభుత్వం జీఓ నంబర్ 58 విడుదల చేసింది. ఆర్టీసీ నిధుల నుంచే రిటైర్డ్ ఉద్యోగులకు మొత్తం చెల్లించాలని మార్గదర్శకాలు జారీ చేసి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు సెటిల్‌మెంట్స్ ఆడిట్ చేయించి నూతన జీఓ మేరకు బెనిఫిట్స్ ఇవ్వడంలో జాప్యం చేస్తుండడం రిటైర్డ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికై నా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు
అందని అదనపు ప్రయోజనాలు
కళ్లకు కాయలు కాసేలా
ఎదురుచూపులు
కుటుంబ జీవనానికి అష్టకష్టాలు


