కదిరి అర్బన్: ఆర్టీసీ డ్రైవర్‌గా 2019లో పదవీ విరమణ పొందిన గంగప్పకు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ విశ్రాంత ఉద్యోగులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. శుక్రవారం ఎన్‌ఎంయూ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగప్ప తన పెన్షన్ పేపర్లను 2019లోనే సమర్పించినా మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. హైదరాబాద్‌లోని పీఎఫ్ కార్యాలయ సిబ్బంది చేసిన తప్పునకు ఆయనను బలి చేస్తున్నారన్నారు. పెన్షన్ రాక గంగప్ప తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని తెలిపారు. సమావేశంలో విశ్రాంత ఉద్యోగులు హరిమోహన్, అబ్బాస్, సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ
అనంతపురం: పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యమని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఈ.భీమారావు అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనంతపురం కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి, కాలుష్య రహిత సమాజ స్థాపనకు పర్యావరణ ఆవశ్యకతను గుర్తించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం కేవలం ఒకరోజుకే పరిమితం కారాదన్నారు. నిరంతర ప్రక్రియ కావాలన్నారు.


