ధరల పెంపుదలతో సామాన్యులపై భారం | - | Sakshi
Sakshi News home page

ధరల పెంపుదలతో సామాన్యులపై భారం

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

అనంతపురం టవర్‌క్లాక్‌: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. పెంచిన ధరలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో ఎన్జీవో హోంలో గురువారం సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణ స్వామి అధ్యక్షత జరిగిన సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం తరచూ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను అధికంగా పెంచి ప్రజలపై గుదిబండ వేస్తోందన్నారు. ధరలు స్థిరంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పరిపాలన కన్నా ప్రజల నాశనమే లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్‌, వేమయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, నాయకులు నాగరాజు, వీరానారాయణ, మల్లికార్జున, వేమన, శ్రీరాములు, కేశవ రెడ్డి, నారాయణ స్వామి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, రాజేష్‌ గౌడ్‌, కుళ్లాయి స్వామి, చిరంజీవి, రామాంజనేయులు, పెద్దయ్య, నాగార్జున పార్వతి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

ధర్మవరం అర్బన్‌: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలోని చిన్నూరు లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వన్‌ టౌన్‌ పోలీసులు తెలిపిన మేరకు.. చిన్నూరుకు చెందిన శ్రీనివాసులు భార్య పుష్ప (33) గతంలో అనంతపురంలోని నారాయణ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసేది. ఇంటి వద్దనే ఉంటూ భర్త, పిల్లలతో ఉంటోంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావడంతో క్షణికావేశంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వన్‌ టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతురాలికి భర్త శ్రీనివాసులు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త బేల్దారి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య మృతి చెందిందని తెలిసిన వెంటనే భర్త స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన పుష్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ..

ఇద్దరి పరిస్థితి విషమం

గుమ్మఘట్ట: రాయదుర్గం మండలం వడ్రహొన్నూరు గేటు వద్ద గురువారం ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాలు.. వడ్రహొన్నూరుకు చెందిన విజయ్‌, భాస్కర్‌ ట్రాక్టర్‌లో మట్టి నింపుకొని అనంతపురం రహదారి వైపు వెళ్తుండగా.. అదే సమయంలో రాయదుర్గం వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనింది. ఈప్రమాదంలో ట్రాక్టర్‌ రెండు భాగాలుగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో విజయ్‌,భాస్కర్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని అర్బన్‌ సీఐ జయానాయక్‌ పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement