● మున్సిపల్ ఆస్తుల అద్దె వసూళ్ల విధి విధానాల్లో మార్పులు
● అంతస్తుల వారీగా అద్దెలు
● గతంలో మూడేళ్లకోసారే పెంపుదల
కదిరి: మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల ఆస్తులపై వసూలు చేసే అద్దెలు, లీజులకు సంబంధించి చంద్రబాబు సర్కారు విధి విధానాలను మార్పు చేసింది. ఇప్పటి దాకా మూడేళ్లకొకసారి మాత్రమే అద్దెలు పెంచేవారు. ఇకపై ఏటా 7 శాతం అద్దెలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు(జీఓ ఎంఎస్.నెం.92)జారీ చేసింది. అద్దె గదుల లీజ్ గడువు ముగియగానే కొత్త రూల్స్ అమలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది.
మార్కెట్ విలువను బట్టి..
జిల్లాలో కదిరి, ధర్మవరం, హిందూపురం, పుట్టపర్తి, మడకశిర, పెనుకొండ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతి పట్టణంలోనూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. అందులోని అద్దె గదులను పలువురు వ్యాపారులు వేలం పాట ద్వారా వాటిని దక్కించుకొని తమ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీటి అద్దెలు మూడేళ్ల కొకసారి మాత్రమే కేవలం 33.5 శాతం పెంచి ఆ అద్దె గదులను వీరికే కేటాయిస్తూ వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏటా 7 శాతం మాత్రమే పెంచుతామని పైకి చెబుతున్నా..ఇందులో పెద్ద మోసమే దాగి ఉంది. మున్సిపాలిటీకి సంబందించిన షాపింగ్ కాంప్లెక్స్‌లలోని అద్దె గదులను ఇచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే వాణిజ్య దుకాణాల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకొని అందులో 10 శాతం కనీస అద్దెగా నిర్ణయిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని తర్వాత వేలం పాట పెడతారు. వేలంలో హెచ్చు పాటదారుడికి ఆ దుకాణం కేటాయిస్తారు. ఆ తర్వాత ప్రతి ఏటా 7 శాతం అద్దెను పెంచుతూ పోతారు.
పెంపును వ్యతిరేకిస్తే లీజ్ రద్దు: మున్సిపల్ అద్దె గదులకు సంబందించి 7 శాతం పెంపును ఎవరైన వ్యతిరేకిస్తే అలాంటి వారి లీజ్‌ను రద్దు చేసి, తిరిగి వేలం పాట వేసి, ఇతరులకు కేటాయిస్తారు. కోర్టును ఆశ్రయించేందుకు కూడా అవకాశం లేకుండా ముందే సదరు కాగితాల్లో సంతకాలు చేయించుకుంటారు. పై అంతస్తుల్లో ఉన్న అద్దె గదులకు పెద్దగా డిమాండ్ లేని కారణంగా గ్రౌండ్ ఫ్లోర్‌తో పోలిస్తే మొదటి అంతస్తుకు 20 శాతం, రెండు, ఆ పై అంతస్తుల్లో ఉన్న గదులకు 30 శాతం అద్దె తగ్గించారు. కొత్త నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాల వరకూ మున్సిపాలిటీలే నిర్ణయం తీసుకుంటాయి. 4 నుంచి 25 ఏళ్ల లీజ్‌కు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.


