హిందూపురం: మండలంలోని కిరికెర బసవన్నపల్లికి చెందిన దుర్గా, చిరంజీవి దంపతుల నాలుగేళ్ల చిన్నారి శ్రీవల్లి. రెండు రోజుల క్రితం అదృశమైంది. తల్లిదండ్రులు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీవల్లి కోసం పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత చెరువులో శ్రీవల్లి శవం తేలియాడుతూ కనిపించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చిన్నారి శవాన్ని వెలికితీశారు. శవపంచనామా చేసిన అనంతరం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి శవ పరీక్షల నిమిత్తం తరలించారు. చిన్నారి మృతిపై పోలీసులు దర్యాప్తు మమ్మరం చేశారు. శ్రీవల్లి శవమై కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు ఆలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, చిన్నారికి నీటిలో ఆడుకోవడమంటే ఇష్టమని, పలుసార్లు చెరువు వద్దకు వెళ్లి ఆడుకునేదని, ఏమైనా చెరువు వద్దకు వెళ్లి జారి పడిపోయిందా.. లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


