డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్‌

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

అనంతపురం అర్బన్‌: రాష్ట్రవ్యాప్తంగా 27 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ పోస్టింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలో ఇటీవల డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతి పొందిన ఎ.హరికుమార్‌ను బాపట్ల ఆర్‌డీఓగా నియమించారు. ప్రస్తుతం ఈయన రాయదుర్గం తహసీల్దారుగా ఉన్నారు. అలాగే పి.విజయకుమారిని శ్రీసత్యసాయి జిల్లా కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీగా నియమించారు. ప్రస్తుతం ఈమె రాప్తాడు తహసీల్దారుగా ఉన్నారు. హెచ్‌ఎల్‌ఎల్‌సీ (భూసేకరణ) ఎస్‌డీసీగా ఉన్న ఎం.రామ్మోహన్‌ను అనంతపురం జిల్లా కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీగా నియమించారు. హెచ్‌ఎల్‌ఎల్‌సీ (భూసేకరణ) ఎస్‌డీసీగా వి.వెంకటనారాయణను నియమితులయ్యారు.

లింగ నిర్ధారణ చట్టవిరుద్ధం

ప్రశాంతి నిలయం: లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని, చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ హెచ్చరించారు. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో డీఎల్‌ఎంఎంఏ సమావేశాన్ని నిర్వహించారు. చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, అందుకు సహకరించినా క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. కొత్తగా నాలుగు అల్ట్రా సౌండ్‌, స్కాన్‌ సెంటర్లకు అనుమతులు మంజూరు చేశారు. అలాగే మూడు పాత సెంటర్లను రెన్యూవల్‌ చేశారు. మార్పులు చేర్పులు, నూతన పరికరాల కొనుగోలు చిరునామా మార్పు కోసం అందిన 4 దరఖాస్తులను ఆమోదించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లను ప్రోగ్రాం అధికారులు, సబ్‌ డివిజనల్‌ అఽధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజా బేగం, డెమో సుబ్రహ్మణ్యం, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

10 మండలాల్లో వర్షం

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకూ జిల్లాలోని 10 మండలాల్లో వర్షం కురిసింది. మొత్తంగా 91.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చిలమత్తూరు మండలంలో 28.6 మి.మీ, గోరంట్ల 24.2 మి.మీ, లేపాక్షి 10.4, నల్లచెరువు 10.2, గాండ్లపెంట 3.8, సీకేపల్లి 3.4, కదిరి 3.2, ఓడీచెరువు 3.2, అమడగూరు 2.4, తనకల్లు మండలంలో 2.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

అర్హులందరికీ రుణాలివ్వాలి

బ్యాంకర్లకు కలెక్టర్‌ ఆదేశం

ప్రశాంతి నిలయం: అర్హులందరికీ నిర్ణీత గడువులోపు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ బ్యాంకర్లను ఆదేశించారు. అలాగే సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి త్రైమాసిక జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (డీఎల్‌ఆర్సీ) సమావేశం గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించారు. జిల్లాలోని బ్యాంకింగ్‌ ప్రగతి, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు మొత్తంగా రూ.12,051 కోట్లు డిపాజిట్లు సేకరించాయని, రూ.22,009 కోట్ల మేర రుణాలు ఇచ్చాయన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలన్నారు. అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్‌, పీఎంఎఫ్‌ఎంఈ పథకాలను క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఫణీంద్ర కుమార్‌, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement