పర్మిషన్‌ లేకుండానే ప్రవేశాలు! | - | Sakshi
Sakshi News home page

పర్మిషన్‌ లేకుండానే ప్రవేశాలు!

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ధర్మవరంలో రఘు మెడ్జ్‌ స్కూల్‌, ఫజుల్లా స్కూల్‌, రిషి విద్యాలయ హైస్కూల్‌ పేరుతో కొత్తగా మూడు పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆయా యాజమాన్యాలు పాఠశాల ఏర్పాటుకు మాత్రమే అనుమతులు తెచ్చుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారు. సైనిక్‌, నవోదయ కోచింగ్‌, ఏసీ క్యాంపస్‌ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు వల వేసి రూ.వేలకు వేలు ఫీజులు చేసుకుంటున్నారు.

నిబంధనలకు నీళ్లు..

ధర్మవరంలో ఏర్పాటు చేస్తున్న సదరు మూడు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలాయి. ప్రభుత్వం నుంచి యూడైస్‌ నంబర్‌ రాకుండానే అడ్మిషన్లు చేపట్టాయి. పైగా సమీపంలోని విద్యా సంస్థల నుంచి ఎన్‌ఓసీ కూడా తెచ్చుకోలేదు. నిబంధనల ప్రకారం నూతనంగా ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తే సదరు పాఠశాల నుంచి కనీసం కిలోమీటర్‌ వరకు మరో ప్రాథమిక పాఠశాల ఉండకూడదు. అలాగే హైస్కూల్‌కు అయితే 3 కిలోమీటర్లలోపు మరో పాఠశాల ఉండకూడదు. కానీ ఈ నిబంధనను కొత్తగా ఏర్పాటైన పాఠశాలలు యాజమాన్యాలు పట్టించుకోలేదు. దీంతో ప్రైవేట్‌ పాఠశాలల అసోసియేషన్‌ సభ్యులు ఆయా పాఠశాలలపై హైకోర్టులో కేసు వేశారు. అయితే వేసవి సెలవులు ఉండటంతో కేసు విచారణకు రాలేదు. ఈలోపే నూతన పాఠశాలల యాజమాన్యాలు హడావుడిగా అడ్మిషన్లు చేసేస్తున్నాయి.

మామూళ్ల మత్తులో అధికారులు..

కేవలం పాఠశాల ఏర్పాటుకు అనుమతి తెచ్చుకుని అడ్మిషన్లు చేస్తున్నా..జిల్లా విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. వాస్తవానికి పాఠశాల ఏర్పాటుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చినా... నిభందనలు పాటించక పోతే గుర్తింపు ఇవ్వదు. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఈ మూడు పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు లేదు. అయినా వారు అడ్మిషన్లు చేస్తున్నారు. ఆ తర్వాత గుర్తింపు రాకపోతే విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుంది.

‘రిషి’ మాయాజాలం..

రిషి విద్యాలయాన్ని ఈ ఏడాది హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. అయితే ఈ పాఠశాల క్యాంపస్‌ సీకేపల్లి మండలంలో ఉంది. మరో హాస్టల్‌ క్యాంపస్‌ ధర్మవరం పరిధిలో ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్‌కు 8, 9వ తరగతులకు మాత్రమే పర్మిషన్‌ తెచ్చుకుని.. మిగతా తరగతులకూ అడ్మిషన్లు చేస్తున్నారు.

ధర్మవరంలో ప్రైవేట్‌

పాఠశాలల ఇష్టారాజ్యం

ప్రభుత్వ గుర్తింపులేకుండానే ముందస్తు అడ్మిషన్లు

మామూళ్ల మత్తులో

కళ్లు మూసుకున్న విద్యాశాఖ అధికారులు

ఏడాది క్రితం బత్తలపల్లిలో ‘ఫినిక్స్‌ గ్లోబల్‌ స్కూల్‌’ పేరుతో కొందరు ఓ పాఠశాల ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అనుమతులు రాకుండానే ఐఐటీ ఫౌండేషన్‌...ఏసీ క్యాంపస్‌.. అంటూ ప్రచారం ఊదరగొట్టారు. దీంతో 150 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. ఆ తర్వాత కూడా అనుమతులు రాకపోవడంతో ఆరు నెలల తర్వాత బోర్డు తిప్పేశారు. కానీ అప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 50 శాతం ఫీజులు వసూలు చేశారు. దీంతో వారంతా రోడ్డెక్కి ధర్నాకు దిగారు. విద్యాసంవత్సరం మధ్యలో పాఠశాలను మూసివేస్తే పిల్లలను ఎక్కడ చేర్పించాలంటూ గగ్గోలు పెట్టారు. ఇంత జరిగినా విద్యాశాఖ చర్యలు తీసుకోలేదు. తాజాగా ధర్మవరంలోనూ కొత్తగా మూడు పాఠశాలలు ఇదేరకంగా ముందస్తు దందా ప్రారంభించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement