ధర్మవరం రూరల్: కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ సూచించారు. గురువారం ఆయన మండలంలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన ఓబుళనాయనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పాత కక్షలు, కుటుంబ విభేదాలు, ఫ్యాక్షన్ గొడవలు గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారతాయన్నారు. ప్రతీకార భావాలు, హింసాత్మక చర్యలు వ్యక్తులకే కాకుండా కుటుంబాల భవిష్యత్‌ను కూడా దెబ్బ తీస్తాయన్నారు. యువత చెడు అలవాట్లకు, నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి విద్య, ఉపాధి వైపు ప్రోత్సహించాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా...శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అంతకు ముందు ఆయన గ్రామంలో పర్యటించి మహిళలు ప్రస్తావించిన సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను సంప్రదించాలన్నారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ వెంట ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ రాజశేఖర్, తదితరులు ఉన్నారు.
ఓబుళనాయనపల్లి గ్రామస్తులతో
ఎస్పీ సతీష్‌కుమార్


