పుట్టపర్తి అర్బన్: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ 15 మండలాల పరిధిలో వర్షం కురిసింది. మొత్తంగా 193.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా ధర్మవరం మండలంలో 36.4 మి.మీ, రామగిరి మండలంలో 26.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక కనగానపల్లి మండలంలో 24.4 మి.మీ, సీకేపల్లి 23.6, గాండ్లపెంట 22.4, బత్తలపల్లి 16.4, ముదిగుబ్బ 11.6, రొద్దం 9.4, ఓడీచెరువు 5.4, అమరాపురం 4.2, హిందూపురం 3.2, లేపాక్షి 3.0, తాడిమర్రి 2.8, రొళ్ల 2.4, గోరంట్ల మండలంలో 2.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
బాలసదనంలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
బత్తలపల్లి: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల సదనంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ సరస్వతి తెలిపారు. బుధవారం ఆమె స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆరేళ్ల నుంచి 11 ఏళ్లలోపు బాలికలు మాత్రమే అర్హులన్నారు. తల్లిదండ్రులు లేని వారు, తల్లిదండ్రులలో ఒకరు ఉండి మరొకరు లేని వారు, నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల కోసం బాల సదనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాల సదనంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంటుందని, వసతి, ఉచిత విద్య, మెనూ ప్రకారం భోజనం అందిస్తామన్నారు. వివరాలకు 738611833, 7075633900 నంబర్లలో సంప్రదించాలన్నారు.


