● ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ‘ఫైనాన్స్’ వేధింపులు పెచ్చుమీరాయి. హిందూపురం మండలం బీరేపల్లి గ్రామంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. కూల్‌డ్రింక్‌లో విషపు గుళికలు కలిపిన మహిళ తాను తాగడంతో పాటు కుమార్తె, కుమారుడికీ తాగించింది. ఈ ఘటనలో తల్లీకుమారుడు మృతి చెందగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.
● మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వారం వడ్డీ పేరుతో వేధిస్తున్నారు. రూ.100కు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. సక్రమంగా కంతులు చెల్లించకుంటే ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు దిగడంతో పాటు భౌతిక దాడులకూ దిగుతున్నారు. ఆర్నెల్ల క్రితం శాంతినగర్‌లోని ఓ కుటుంబంపై యర్రగుంట్లకు చెందిన వడ్డీ వ్యాపారులు దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సాక్షి, పుట్టపర్తి
జిల్లాలో ‘ఫైనాన్స్’ సంస్థలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారులూ సందుకొకరు పుట్టుకువచ్చారు. ఫైనాన్స్ సంస్థ అయినా, వడ్డీ వ్యాపారి అయినా వాళ్ల టార్గెట్ వడ్డీ పేరుతో భారీగా దండుకోవడమే. ఈ క్రమంలోనే పేదల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని రూ.10, రూ.20 చొప్పున వడ్డీతో రుణం ఇచ్చి పేదలపై మోయలేని భారం మోపుతూ వారి జీవితాలు ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధిక వడ్డీ భారం భరించలేక కుటుంబ పెద్దలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.
గతంలో వ్యవసాయంలో పెట్టుబడి కోసం రైతులు తెలిసిన వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పంట వచ్చాక చెల్లించేవారు. కానీ చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించారు. పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నారు. వ్యాపారం బాగా జరుగుతుందన్న అశతో ఒక్కోసారి ఎంత వడ్డీ అయినా వెనకడుగు వేయడం లేదు. ఇక ఉన్నఫలంగా వచ్చి పడే ఖర్చులతో ప్రభుత్వ ఉద్యోగులు సైతం అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి వారి అవసరాలను ఆసరాగా చేసుకుని గోరంట్ల, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, హిందూపురం, పెనుకొండ తదితర ప్రాంతాల్లో ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారులు పుట్టుకు వచ్చారు. సామాన్యులను పీల్చిపిప్పిచేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. అప్పు తీసుకున్న వారు ఎవరైనా సరే సకాలంలో డబ్బు తిరిగి చెల్లించాల్సిందే. లేకపోతే భౌతిక దాడులకూ వెనకాడటం లేదు.
జిల్లాలోని కొందరు బడాబాబులు వడ్డీ వ్యాపారుల అవతారమెత్తారు. అక్కడక్కడా కొందరు ఏజెంట్లను పెట్టి.. ప్రభుత్వ ఉద్యోగులకు అప్పులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల ఏటీఎం కార్డులు తీసుకుంటారు. వేతనం జమ కాగానే.. వడ్డీ డబ్బులు డ్రా చేసుకుని మిగతా మొత్తం వారికి ఇస్తారు. ఇక మహిళా ఉద్యోగులకై తే తక్కువ వడ్డీ అంటూ ఆశ చూపుతున్నారు. అనంతరం సదరు ఉద్యోగులతో పరిచయం పెంచుకుని మరింత అప్పు తీసుకునేలా పన్నాగం పన్నుతారు. ఆ తర్వాత ఉన్న ఫళంగా డబ్బుల కోసం గొడవలు చేస్తారు. అప్పు వసూలు పేరుతో వేళాపాలా లేకుండా ఫోన్లు చేస్తూ నరకం చూపుతారు. మెల్లగా లొంగదీసుకునే ప్రక్రియ మొదలుపెడతారు. గుట్టు చప్పుడు కాకుండా చేసే కార్యక్రమాలకు కొందరు అంగీకరించి ట్రాప్‌లో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు అప్పు చెల్లించలేక.. వారి అడిగింది ఇవ్వలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంకొందరు ఆస్తులు అమ్మి.. అప్పులు చెల్లిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో వెలుగు చూశాయి. వడ్డీ వ్యాపారుల ఆగడాలకు ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి.
అవసరాల నుంచి హనీ ట్రాప్ వరకు..
సామాన్యులను పీల్చిపిప్పిచేస్తూ..
అధిక వడ్డీ కోసం వేధిస్తూ ఊరుకోం. బాధితులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో ధర్మవరంలో జరిగిన ఘటనపై కఠిన చర్యలు తీసుకున్నాం. ఫైనాన్స్ సంస్థలైనా, వడ్డీ వ్యాపారులైనా అధిక వడ్డీ వసూలు చేయడం నేరం. చట్టానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకుంటాం.
– ఎస్.సతీష్‌కుమార్, ఎస్పీ
ప్రాణాలు తీస్తున్న ‘ఫైనాన్స్’ వేధింపులు
అధిక వడ్డీలు చెల్లించలేక బలవన్మరణాలు
డబ్బు చెల్లించని వారిపై లైంగికంగా వేధింపులు
ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురంలోనే అధికం
గతంలో ధర్మవరంలో
ఓ కుటుంబంపై వ్యాపారి దాడి
హిందూపురంలో
ఫైనాన్స్ వేధింపులకు
కుటుంబం బలి


