ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో దళితులపై దాడుల నిరోధానికి చర్యలు తీసుకుంటామని ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అన్నారు. ఎక్కడైనా దాడులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ... దళితుల రక్షణకు, హక్కులకు భంగం కలగకుండా చట్టాలను పగడ్బందీగా అమలు చేస్తామన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని, ఎస్సీ సబ్‌ప్లాన్, ఇతర సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై 170 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రెడ్డి బాలాజీ, ఐఏఎస్ అధికారి చిన్నరాముడు, కమిషన్ సభ్యులు భిక్షం మేకల, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పుట్టపర్తి సాయినగర్ ఎస్సీ కాలనీ వాసులు చైర్మన్ కె.ఎస్ జవహర్‌ను కలిశారు. ఎస్సీల శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సాయినగర్‌లో 350 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని, తమకు శ్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతుమన్నామన్నారు. కమిషన్ చైర్మన్ జవహర్ స్పందించి... క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
దళితుల సమస్యలను పరిష్కరించండి..
పుట్టపర్తి: జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌కు విన్నవించారు. బుధవారం పలువురు దళితులతో కలిసి కలెక్టరేట్ విచ్చేసిన ఆయన... ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో దళితులకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని 22–ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చిందన్నారు. వెంటనే వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలన్నారు. పారిశ్రామిక వాడలకు దళితుల భూమిని సేకరించకుండా చూడాలన్నారు. లేదంటే ఎకరాకు రూ.25 లక్షల పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో దళితుల శ్మశాన వాటిక కోసం రెండెకరాలు కేటాయించేలా చూడాలన్నారు. దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోసునేలా యంత్రాంగాన్ని ఆదేశించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి ఫొటో సాయి, జిల్లా కార్యదర్శులు చిన్నప్ప, రామయ్య, సాకే నారాయణస్వామి, ఆలమూరు ఓబులేసు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్


