పుట్టపర్తి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. బుక్కపట్నం మండలంలో చేసిన పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ అధికారి నితిన్ బృందం బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో విచారణ చేపట్టింది. మండలంలో చేసిన పనులు...వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు ఏపీఓతో పాటు ఉపాధి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఏ ఒక్క ప్రశ్నకు స్థానిక అధికారుల వద్ద సమాధానం లేకపోయింది. ముఖ్యంగా ఆరోపణలతో విధులు నుంచి తొలగించిన గశికవారిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్‌ను తిరిగి విధుల్లోకి ఎందుకు తీసుకున్నారని ఏపీఓ శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు. అదే విధంగా కూలీల నుంచి మేట్లు రూ.200 డిమాండు చేస్తున్నారన్న ఆరోపణలపై మీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. కానీ ఏపీఓ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో బుక్కపట్నం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సమగ్ర విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.


