పుట్టపర్తి: జిల్లాలోని ఉపాధ్యాయులకు 4వ తేదీ నుంచి ఎఫ్‌ఎల్‌ఏ శిక్షణ ఇస్తున్నట్లు డీఈఓ కిష్టప్ప ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి చెప్పే వారు, సింగిల్ టీచర్లు, డీఎస్సీ– 2025 టీచర్లు, యూపీ స్కూల్, ఉన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే వారు శిక్షణలో పాల్గొనాలన్నారు. కదిరి–1 కేంద్రంలో కదిరి, తలుపుల, ఓడీసీ, నల్లచెరువు మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందన్నారు. కదిరి–2 కేంద్రంలో ఎన్‌పీ కుంట, గాండ్లపెంట , తనకల్లు, అమడగూరు మండలాల టీచర్లకు, పెనుకొండలో పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం మండలాల టీచర్లకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మడకశిరలో మడకశిర, అగళి, గుడిబండ, రొళ్ల, అమరాపురం మండలాల టీచర్లకు, హిందూపురంలో హిందూపురం, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు మండలాల టీచర్లకు, ధర్మవరంలో ధర్మవరం, కనగానపల్లి, సీకేపల్లి, రామగిరి, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల టీచర్లకు, కొత్తచెరువులో కొత్తచెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం, నల్లమాడ, గోరంట్ల మండలాల టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు.
కేంద్ర గ్రంథాలయ
కార్యదర్శిగా శివప్రసాద్
అనంతపురం కల్చరల్: ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా జె. శివప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు పౌర గ్రంథాలయశాఖ డైరెక్టర్ అకేపాటి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎఫ్‌ఏసీ కార్యదర్శిగా కొనసాగుతున్న కమ్మన్న నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కమ్మన్న జిల్లా కేంద్ర గ్రంథాలయ డిప్యూటీ గ్రంథాలయాధికారిగా కొనసాగనున్నారు. శివప్రసాద్ ప్రస్తుతం తిరుపతి గ్రంథాలయంలో గ్రేడ్–1 లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నారు.
‘బైండోవర్’ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా
ధర్మవరం అర్బన్: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా విధించినట్లు టూటౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపారు. స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన పసల మనోజ్‌కుమార్ 2025లో రూ.లక్ష విలువైన బాండ్‌ను ఏడాది కాలపరిమితితో రాసిచ్చాడని తెలిపారు. బాండ్ అమలులో ఉన్న సమయంలోనే మనోజ్‌కుమార్‌కు ఒక కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో నిందితుడికి నోటీసులు జారీ చేసి రూ.50 వేల జరిమానా విధించినట్లు వెల్లడించారు.
భూసేకరణ పూర్తి చేయండి
ప్రశాంతి నిలయం: ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక పార్కులు, ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీఓ, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చిలమత్తూరు, హిందూపురం, లేపాక్షి, పుట్టపర్తి, మడకశిర మండలాల్లో వివిధ గ్రామాల్లో జరుగుతున్న భూ సేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే ఆమోదం పొందిన భూ సేకరణ కేసులను , పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలన్నారు. ఆర్.అనంతపురం గ్రామస్తులకు మంజూరైన ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పంపిణీ చేసి భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు.
ప్రశాంతంగా ‘పది’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
పుట్టపర్తి: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాల్లో మంగళవారం సోషల్ పరీక్ష జరిగినట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 2,294 మంది హాజరుకావాల్సి ఉండగా 1,868 మంది హాజరయ్యారన్నారు. 426 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అలాగే ఓపెన్ విద్యార్థులు 244 మందికి గాను 214 మంది హాజరయ్యారని, 30 మంది గైర్హాజరైనట్లు చెప్పారు.


