ఎన్‌పీకుంట: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం సమీపంలో కదిరి–రాయచోటి ప్రధాన రహదారిపై పశువులను అక్రమ రవాణా చేస్తున్న కంటైనర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి చేరుకుని పశువులకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. పశువుల కొనుగోలుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. మూడు కంటైనర్లలో 129 ఎద్దులు, బర్రెలు ఉన్నట్లు గుర్తించారు. నంద్యాల, అనంతపురం తదితర ప్రాంతాల్లో కొనుగోలు చేసి కేరళ రాష్ట్రం పొలాచికి తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తుండటంతో జరిమానా విధించి, డ్రైవర్లను తహసీల్దార్ దేవేంద్రనాయక్ ఎదుట బైండోవర్ చేశారు. కాగా, అంతకు మునుపే మరో నాలుగు కంటైనర్లు జిల్లా సరిహద్దు దాటి వెళ్లడం గుర్తించిన స్థానికులు టి.జగదీశ్వర్‌రెడ్డి, కసెట్టి రామ్మోహన్‌లు వెంబడించి గాలివీడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మక్బూల్‌బాషా, స్థానిక పోలీసు సిబ్బంది ఉన్నారు.


