మాత్ర వేద్దాం.. నులిమేద్దాం | - | Sakshi
Sakshi News home page

మాత్ర వేద్దాం.. నులిమేద్దాం

Feb 17 2026 8:51 AM | Updated on Feb 17 2026 8:51 AM

మాత్ర

మాత్ర వేద్దాం.. నులిమేద్దాం

పుట్టపర్తి అర్బన్‌: నులి పురుగులు... పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్నారుల్లో రక్త హీనతకు దారి తీస్తాయి. శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారుతాయి. కడుపులో చేరి నొప్పి, మంట, వికారం కలగజేస్తాయి. దీంతో ఆహారం సహించదు, ఆకలి ఉండదు. త్వరగా నీరస పడిపోతారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. మలంలో రక్తం, అతిసారం వంటి సమస్యలు ప్రబలుతాయి. చిన్నారుల ఆరోగ్యంపై ఇంతలా ప్రభావం చూపే నులిపురుగులను ఆల్బెండజోల్‌ మాత్రతో నివారించవచ్చు. ఆల్బెండజోల్‌ మాత్ర కడుపులోని నులి పురుగులు, ఏలిక పాములు, కొంకి పురుగులను నివారిస్తుంది. అందుకే ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వాస్థ్య ఆరోగ్య మిషన్‌ (ఆర్‌బీకేఎస్‌) ద్వారా ఏటా ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో రెండుసార్లు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారందరికీ ఉచితంగా మాత్రలను అందిస్తోంది.

నులిపురుగులు ఇలా చేరతాయి..

వ్యక్తి గత పరిశుభ్రత పాటించని పిల్లలకు నులి పురుగుల సమస్య అధికంగా ఉంటుంది. పిల్లల చేతి గోళ్లలో పేరుకున్న మట్టి ద్వారా నులి పురుగులు కడుపులోకి వెళ్తాయి. కలుషిత ఆహారం, నీరు, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనతో సైతం నులి పురుగులు కడుపులోకి చేరే అవకాశం ఉంటుంది. భోజనానికి ముందు చేతులు కడుక్కోక పోవడం, కూరగాయలు కడగక పోవడం, మూతలు పెట్టకుండా ఉన్న ఆహార పదార్థాల భుజించినా పురుగుల ప్రభావం అధికంగా ఉంటుంది.

డోసు ఇలా..

ఏడాది నుంచి 2 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్‌ అర మాత్ర (200 మి.గ్రా), రెండేళ్ల నుంచి 19 ఏళ్లలోపు వయస్సు కలిగిన పిల్లలకు 400 మిల్లీ గ్రాముల మాత్ర ఇస్తారు. ఈ మాత్రను చప్పరించాల్సి ఉంటుంది. కడుపులో నులి పురుగులు ఉంటే మాత్ర వేసుకున్న ఒకటి, రెండు రోజుల్లో మల విసర్జన ద్వారా బయటకు వచ్చేస్తాయి.

పోస్టర్ల ఆవిష్కరణ..

నేడు (మంగళవారం) జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్లు విజయ్‌, జనార్దన్‌, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ సునీల్‌ తదితరులు సోమవారం కలెక్టరేట్‌లో పోస్టర్లు ఆవిష్కరించి అవగాహన కల్పించారు. జిల్లాలోని 5,420 విద్యాసంస్థల్లో 3,66,225 మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ ఆయా పాఠశాలలు, కళాశాలల్లోనే మాత్రలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. తొలిరోజు అందుబాటులో లేని వారికి తర్వాత రోజు అందిస్తారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు అంగన్‌వాడీలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి మధ్యాహ్నం భోజనం అనంతరం ఆల్బెండజోల్‌ మాత్రలు అందిస్తారన్నారు.

నులిపురుగుల నివారణకు

ఆల్బెండజోల్‌

జిల్లాలోని 3,66,225 మందికి మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు

నేడు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం

మాత్ర వేద్దాం.. నులిమేద్దాం 1
1/1

మాత్ర వేద్దాం.. నులిమేద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement