బంతి బంతికీ బెట్టింగ్
బంతి బంతికో లెక్క కడుతున్నారు.
వికెట్‌కో విలువ పెడుతున్నారు. ఆటకో పద్దు పెట్టి అడ్డగోలుగా పందెలు ఆడేస్తున్నారు. రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. కొందరి వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులూ చెలరేగిపోతున్నారు. అడిగే వారు లేరన్న ధైర్యం.. తెలిసినా ఏం చేయరులే అనే అలక్ష్యం.. కారణమేదైనా టీ20 వరల్డ్ కప్ క్రికెట్ బెట్టింగ్ నిరంతరాయంగా సాగుతోంది.
ధర్మవరం అర్బన్: ఈ నెల 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లు జరుగనున్నాయి. రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో మూడేసి చొప్పున క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌లను పలు టీవీ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఉమ్మడి జిల్లా కేంద్రంగా ధర్మవరం పట్టణంలో బుకీలు తమ పనిని ప్రారంభించారు.
కొత్త పుంతలు...
క్రికెట్ బెట్టింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. కదిలే కారులో నుంచి.. మారుమూల గ్రామాల వరకు, లాడ్జిలు, నివాస గృహాలు తదితర అన్ని చోట్ల బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్... తదితర సామాజిక మాధ్యమాలను సైతం పందెలకు వినియోగించుకుంటున్నారు. చాలా మంది యువత వారి ఇళ్లల్లో టీవీల ముందు కూర్చొని ఫోన్లలో బెట్టింగ్ కాస్తున్నారు.
బంతి.. బంతికి మారుతున్న బెట్టింగ్..
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో బంతి బంతికి బెట్టింగ్ మారుతోంది. ఎవరు ఫోర్ కొడతారు, ఎవరు సిక్స్ కొడతారన్న అంశంపై కూడా పందెలు కాస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏ జట్టు ఎన్ని ఓవర్లలో విజయం సాధిస్తుందన్న అంశాలపై బెట్టింగ్ సాగుతోంది. రూ.500 నుంచి రూ.లక్షల్లో పందెలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
జీవితాలు చిత్తు..
టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు పచ్చని సంసారాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ధర్మవరం పట్టణం, బత్తలపల్లి, ముదిగుబ్బ తదితర మండలాల్లో పలు విద్యాసంస్థల్లోని విద్యార్థులు, యువకులు సరదాగా పందెం కాస్తూ చివరకు వ్యసనానికి బానిసలవుతున్నారు. దీంతో కుటుంబ పెద్దలకు తెలియకుండానే అప్పుల పాలవుతున్నారు. ఈ వ్యసనాన్ని వడ్డీ వ్యాపారులు తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. బెట్టింగ్ రాయుళ్లకు అవసరమైన డబ్బును రోజుకు నూటికి రూ.5 చొప్పున వడ్డీకి ఇస్తున్నట్లు సమాచారం. గెలుపోటములతో సంబంధం లేకుండా మ్యాచ్ పూర్తవగానే తీసుకున్న అప్పును వడ్డీతో సహా కట్టాల్సి ఉంటుంది.
గ్రామస్థాయికి పాకిన బెట్టింగ్ సంస్కృతి..
క్రికెట్ బెట్టింగ్‌ల సంస్కృతి గతంలో పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే ఉండేది. నేడు ఆ సంస్కృతి గ్రామస్థాయికి పాకింది. కొందరు యువకులు సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ పందెం కాస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్‌లో గెలిచిన వారికి ఓడినవారు రహస్య ప్రదేశాలకు పిలిచి డబ్బులు చెల్లిస్తున్నారు. కొందరు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నగదు బదలాయిస్తున్నారు. బెట్టింగ్‌లో గెలిచిన వారు ఆనందంతో, ఓడిన వారి బాధతో అతిగా మద్యం సేవిస్తున్నారు.
టీ కేఫ్‌లలో బెట్టింగ్‌ల జోరు...
క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసలయిన వారు వారు ధర్మవరం పట్టణంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. పట్టణంలోని టీ కేఫ్‌లన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు కిటకిటలాడుతున్నాయి.
ఆన్‌లైన్ బెట్టింగ్‌లే ఎక్కువ
బెట్టింగ్‌లన్నీ ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడైనా అనుమానితులు ఉంటే వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించి బెట్టింగ్ ఆడుతున్నట్లు నిర్ధారణ అయితే ఫోన్లను సీజ్ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదు చేస్తాం. – హేమంత్‌కుమార్, డీఎస్పీ, ధర్మవరం
జోరుగా క్రికెట్ బెట్టింగ్
పల్లెలకూ పాకిన
క్రికెట్ పందేల సంస్కృతి
చిత్తవుతున్న యువత
బంతి బంతికీ బెట్టింగ్
బంతి బంతికీ బెట్టింగ్


