వైభవంగా వీరనారాయణస్వామి జాతర
బత్తలపల్లి: శివరాత్రి తర్వాత మరుసటి దినం బత్తలపల్లి మండలం రామాపురంలో నిర్వహించిన వీరనారాయణస్వామి జాతర సోమవారం వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా చిత్రావతి నదిలోకి తీసుకెళౠ్లరు. ఎగువగుడి అర్చకులు కప్పల నరేంద్ర, రామప్ప, నారప్ప, దిగువగుడి అర్చకులు కప్పల నంద, నారాయణస్వామి, నాగన్న స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో చిత్రావతి నది జనసంద్రమైంది. చుట్టు ప్రక్కల గ్రామాల రైతులు ఎడ్లబండ్లను, ట్రాక్టర్లను అలంకరించుకుని ఊరేగింపుగా వచ్చారు. మండలంలోని గంటాపురం, మాల్యవంతం తదితర గ్రామాల్లో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అన్నదానాలు జరిగాయి. ఈ సందర్భంగా ‘ఈ ఏడాది సాగు చేసిన పంటలో ముక్కాలు భాగం చేతికి వస్తుంది. ఆరుద్ర కార్తె, పెద్దకుశాలలో వేసిన పంటలు బాగా పండుతాయి. గొర్రెలు, పశువులకు ఆరోగ్యం బాగుండదు. మానవులకూ ఆరోగ్యం బాగుండదు. వర్షాలు ఓ మోస్తారుగా కురిసి వంకలు, వాగులు ఓ మాదిరిగా ప్రవహిస్తాయి. ఏవైనా సమస్యలు ఉంటే సర్దుబాటు చేసుకోవాలి. లేనిపంతాలకు పోవద్దు. రామభజనలు చేస్తే బాగుంటుంది’ అంటూ భవిష్యవాణిని ప్రధాన అర్చకులు వినిపించారు.
వైభవంగా వీరనారాయణస్వామి జాతర


