హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
కూడేరు: మండలంంలోని మరుట్ల–3వ కాలనీలో సోమవారం చితంబరేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. 14 జతల వృషభాలను పోటీలకు రైతులు తీసుకువచ్చారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన రైతు బోయ చెన్నప్ప వృషభాలు ప్రథమ, కనగానిపల్లి మండలం మద్దెలచెరువు రైతు కొండయ్య వృషభాలు ద్వితీయ, బళ్లారి జిల్లా ఆంధ్రాల గ్రామానికి చెందిన రైతు వీరేష్ వృషభాలు తృతీయ, గార్లదిన్నెకు చెందిన రైతు పఠాన్ బాషా వృషభాలు నాల్గవ, చెన్నేకొత్తపల్లి రైతు సనప నాగరాజు వృషభాలు ఐదో స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులను అభినందిస్తూ నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు.
చిరుత దాడిలో
మేక పిల్లల మృతి
గుడిబండ: చిరుత దాడిలో రెండు మేక పిల్లలు మృతి చెందాయి. గుడిబండ మండలం చిగతుర్పి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జీవాల పోషణతో జీవనం సాగిస్తున్న ఆ గ్రామానికి చెందిన రైతు జసవరాజు.. ఆదివారం రాత్రి జీవాలను తన పొలం వద్ద నున్న దొడ్డిలో వదిలి ఇంటికెళ్లి నిద్రించాడు. సోమవారం ఉదయం అక్కడకు చేరుకునే సరికి రెండు మేక పిల్లలు విగతజీవిగా పడి ఉన్నాయి. చిరుత దాడిలో మేక పిల్లలు మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.
ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు
ధర్మవరం అర్బన్: స్థానిక ఇందిరమ్మకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ యోగిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు. వివరాలను సోమవారం రాత్రి ఆయన వెల్లడించారు. పట్టణంలోని ఓ కాలనీలో నివాసముంటున్న పదో తరగతి విద్యార్థినిని రోజూ స్కూల్‌కు తన ఆటోలో యోగి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి జనవరిలో ఆమైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ నెల 15న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని రాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు మందలించి ఆరా తీశారు. దీంతో ఆటో డ్రైవర్ యోగి తనను పిలుచుకెళ్లి బలవంతం చేయడంతో గట్టిగా అరుస్తానని చెప్పానని, అప్పుడు ఇంటికి సమీపంలో వదిలేసి వెళ్లాడని వివరించింది. గతంలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా బాలిక తెలపడంతో తల్లి ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఆటో డ్రైవర్ యోగిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు


