శివరాత్రి ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
లేపాక్షి: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని శైవ ఆలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈనెల 15, 16, 17, 18 తేదీల్లో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల కోసం చేయాల్సిన భద్రతా ఏర్పాట్లపై హిందూపురం డీఎస్పీ మహేష్‌తో కలిసి స్థానిక పోలీసు అధికారులతో ఆయన చర్చించారు. దేవాలయంలో ఏర్పాట్లు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీసులతో పాటు మరో వందమంది బందోబస్తులో పాల్గొంటారని, 14వ తేదీ సాయంత్రం నుంచి భద్రతా ఏర్పాట్లు ఉంటాయన్నారు. రథోత్సవం సందర్బంగా ఈనెల 15వ తేదీ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహన రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయాల సమీప ప్రాంతాల్లో ఓపెన్ డ్రింకింగ్, ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్, నైట్ విజన్ డ్రోన్లు ద్వారా నిఘా ఉంచుతామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్, హిందూపురం రూరల్ సీఐ జనార్దన్, ఎస్‌ఐ నరేంద్ర, పోలీసులు పాల్గొన్నారు.
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన
ఎస్పీ సతీష్‌కుమార్
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని
పోలీసులకు ఆదేశాలు


