నెలలో 16.2 లక్షల సార్లు

Virat kohli Is Most Searched Person In Google Search By Netizens - Sakshi

కోహ్లి కోసం ఆరా తీసిన నెటిజన్స్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత తరం క్రికెటర్లలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హవా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ కోహ్లి అభిమాన గణం భారీగానే ఉంటుంది. తాజాగా సెమ్‌రష్‌ సంస్థ చేసిన అధ్యయనం ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తోంది. 31 ఏళ్ల ఈ భారత స్టార్‌ ప్రపంచంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన క్రికెటర్‌ అని ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు నెలకు సగటున 16.2 లక్షల సార్లు అభిమానులు కోహ్లి పేరును ఇంటర్నెట్‌లో వెతికారంట! ఆ తర్వాతి స్థానాల్లో హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (9.7 లక్షలు), భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (9.4 లక్షలు) గురించి ఆరా తీశారంట. ఈ జాబితాలోని తొలి పది స్థానాల్లో ఆరుగురు భారత క్రికెటర్లే ఉండటం గమనార్హం.

వీరి తర్వాత జార్జి మకాయ్‌ (9.1 లక్షలు), జోష్‌ రిచర్డ్స్‌ (7.1 లక్షలు), హార్దిక్‌ పాండ్యా (6.7 లక్షలు), సచిన్‌ టెండూల్కర్‌ (5.4 లక్షలు), క్రిస్‌ మాథ్యూస్‌ (4.1 లక్షలు), శ్రేయస్‌ అయ్యర్‌ (3.4 లక్షలు) ఉన్నారు. భారత పురుషుల క్రికెట్‌లో గొప్పగా రాణిస్తోన్న ఎందరో క్రికెటర్లను వెనక్కి నెట్టి మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన (12వ స్థానం), ఆసీస్‌ ప్లేయర్‌ ఎలీస్‌ పెర్రీ (20వ స్థానం) టాప్‌–20లో నిలవడం గమనార్హం. ఈ అధ్యయనం మహిళా క్రికెట్‌ పట్ల ప్రేక్షకుల్లో ఉన్న ఉత్సుకతను తెలుపుతోందని సెమ్‌రష్‌ కమ్యూనికేషన్స్‌ హెడ్‌ ఫెర్నాండో ఆంగ్యులో అన్నారు. ఆటగాళ్ల కేటగిరీలోనే కాకుండా జట్ల విభాగంలోనూ టీమిండియా టాప్‌ లేపింది. టీమిండియా గురించి నెలకు సగటున 2.4 లక్షల సార్లు ఆన్‌లైన్‌లో మారుమోగిందంట! ఆ తర్వాత వరుసగా ఇంగ్లండ్‌ (66 వేలు), ఆస్ట్రేలియా (33 వేలు), వెస్టిండీస్‌ (29 వేలు), పాకిస్తాన్‌ (23 వేలు), దక్షిణాఫ్రికా (16 వేలు), బంగ్లాదేశ్‌ (12 వేలు), న్యూజిలాండ్‌ (12 వేలు), శ్రీలంక (9 వేలు), ఐర్లాండ్‌ (5 వేలు), ఆఫ్గానిస్తాన్‌ (4 వేలు), జింబాబ్వే (3 వేలు) జట్ల గురించి అభిమానులు ఆరా తీసినట్లు అధ్యయనంలో తెలిసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top