
భారత జట్టులో కీలకంగా ఎదిగిన రిచా ఘోష్
నిలకడగా మెరుపు ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న కీపర్
భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లలో రిచా ఘోష్ 30 సిక్సర్లతో మూడో స్థానంలో ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన మాత్రమే ఆమెకంటే ముందుండగా... వారిద్దరు 155, 111 వన్డేలు ఆడారు. రిచా ఇప్పటికి 46 వన్డేలు మాత్రమే ఆడింది. ఆమె వన్డేల్లో అరంగేట్రం చేసిన 2021 నుంచి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రిచాకంటే ఎక్కువ సిక్స్‌లు బాదారు.
మిడిలార్డర్‌లో ఆడుతూ ఫీల్డర్ల పరిమితులు లేని సమయంలో 22 ఏళ్ల రిచా చూపిస్తున్న దూకుడు ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతోంది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా అలవోకగా నాలుగు సిక్సర్లు బాది తన సత్తాను మళ్లీ చూపించింది. వన్డేల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధసెంచరీ (26 బంతుల్లో), టి20ల్లో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు తన పేరిట లిఖించుకున్న రిచా తక్కువ వ్యవధిలో జట్టులో కీలకంగా మారింది. -సాక్షి క్రీడా ప్రతినిధి
సరిగ్గా ఏడాది క్రితం రిచా ఘోష్ 12వ తరగతి పరీక్షల కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకుంది. అటు తానియా భాటియా, ఇటు ఉమ ఛెత్రివంటి వికెట్ కీపర్లతో తీవ్రంగా పోటీ ఉండి కొంత కాలం ఆటకు దూరమైతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉన్న స్థితిలో కూడా రిచా తనంతట తాను తప్పుకుంది. తన ఆటపై రిచాకు ఉన్న నమ్మకం, ఎలాగైనా స్థానం కాపాడుకోగలననే విశ్వాసం ప్రదర్శించిన ఆమె మళ్లీ జట్టులోకి తిరిగొచ్చింది. ఇప్పుడు రిచా కీపింగ్‌కంటే కూడా అలవోకగా భారీ షాట్లు కొట్టి ఆమె బ్యాటింగే భారత్‌కు ప్రధాన బలంగా మారింది.
ఫినిషర్‌గా నిరూపించుకొని...
1, 2, 3, 4, 5, 6, 7, 8... రిచా 46 వన్డేల తన స్వల్ప కెరీర్‌లో ఇలా ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగడం విశేషం. రెండేళ్ల క్రితం ఆ్రస్టేలియాతో జరిగిన వన్డేలో కోచ్ అమోల్ మజుందార్ ప్రయోగాత్మకంగా మూడో స్థానంలో ఆడిస్తే 96 పరుగులతో (రిచా అత్యధిక స్కోరు) అదరగొట్టింది. అయితే టీమ్ కూర్పు, చివర్లో మన బలహీనతలను దృష్టిలో ఉంచుకుంటూ రిచాను కోచ్ మిడిలార్డర్‌కు మార్చడంతో పాటు ఫినిషర్ బాధ్యతలు అప్పగించారు.
2025 డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌పై బెంగళూరు 202 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంలో రిచా ఆడిన ఇన్నింగ్స్ (27 బంతుల్లో 64 నాటౌట్) కూడా మజుందార్ ఆలోచనకు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుత వరల్డ్ కప్‌లోనే దాని ప్రభావం కనిపించింది. దక్షిణాఫ్రికాపై కుప్పకూలే స్థితి నుంచి జట్టుకు మెరుగైన స్కోరు అందించిన రిచా... అంతకుముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 35 పరుగులు చేసింది.
కీపింగ్ నైపుణ్యంపై దృష్టి పెట్టి...
కెరీర్ ఆరంభంలో తన బ్యాటింగ్‌తోనే రిచా భారత జట్టులోకి వచ్చింది. ఆమె దూకుడుపై సెలక్టర్లకు ఉన్న నమ్మకమే అందుకు కారణం. మూడు మ్యాచ్‌లలో మరో కీపర్ జట్టులో ఉండగా, ఆమె స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలోకి దిగింది. నిజాయితీగా చెప్పాలంటే రిచా కీపింగ్‌లో చాలా బలహీనంగా ఉండేది. దేశవాళీలో ఆమె ఎక్కువగా కీపింగ్ చేయకపోవడం కూడా అందుకు కారణం. బెంగాల్ తరఫున ఆడినప్పుడు జట్టులో అప్పటికే స్థిరంగా ఉన్న సీనియర్ కీపర్లు ఉండటంతో ఆమెకు అవకాశాలు రాలేదు. దాంతో రిచా మీడియం పేస్ బౌలింగ్ కూడా చేసేది.
అయితే టి20ల్లో బ్యాటర్‌గా తనకు గుర్తింపు వచ్చిన తర్వాత మాజీ పేసర్ జులన్ గోస్వామి ఇచ్చిన సలహాలు, సూచనలతో కీపింగ్‌ను మెరుగు పర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఫలితంగా తన తొలి వన్డేలోనే పాకిస్తాన్‌పై ఐదుగురు బ్యాటర్లను అవుట్ చేసి కీపర్‌గానూ నిరూపించుకుంది. అయితే మూడేళ్ల క్రితం ఫిట్‌నెస్ సరిగా లేకపోవడంతో రిచా వన్డే, టి20 జట్లలో స్థానం కోల్పోయింది.
19 ఏళ్ల అమ్మాయి అధిక బరువు, కీపర్‌గా కదలికలు కష్టం కావడం చిన్న విషయం కాదు. దీనిని ఆమె వెంటనే అర్థం చేసుకుంది. పూర్తిగా ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టి తనను తాను కొత్తగా కనిపించేలా చేసుకుంది. కొద్ది రోజులకే మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోగలిగింది.
చిన్న వయసులోనే రికార్డులతో...
16 ఏళ్లకే భారత సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన రిచా తక్కువ వ్యవధిలోనే టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ ఆడేసింది. ఆ తర్వాత ఆమె అండర్–19 వరల్డ్ కప్ బరిలోకి దిగడం విశేషం. 2023 జనవరిలో జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడంలో రిచా కీలక పాత్ర పోషించింది. డబ్ల్యూపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టైటిల్ సాధించడంలో కూడా రిచా బ్యాటింగ్ ప్రధాన కారణంగా నిలిచింది. రిచా విధ్వసంకర బ్యాటింగ్ నైపుణ్యమే ‘బిగ్‌బాష్ లీగ్’లో హోబర్ట్ హరికేన్స్... ‘హండ్రెడ్’ లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫోనిక్స్, లండన్ స్పిరిట్ జట్ల తరఫున ఆడే అవకాశం కల్పించాయి.
పరిస్థితులను బట్టి తన ఆటను మార్చుకోగలనని కూడా దక్షిణాఫ్రికాతో పోరులో రిచా నిరూపించింది. మహిళల వన్డేల్లో 100కు పైగా స్ట్రయిక్ రేట్ అంటే అసాధారణ విషయం. ఇదే జోరును మున్ముందూ కొనసాగించగలిగితే రిచా సుదీర్ఘ కాలం భారత జట్టు తరఫున అద్భుత ప్రదర్శనలు ఇవ్వగలదు.
చిన్నప్పుడు క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన రోజుల నుంచి నాకు సిక్సర్లు కొట్టడం అంటే చాలా ఇష్టం. అదే ఇప్పుడు నా ఆటలో కనిపిస్తుందని నమ్ముతాను. అయితే అలాంటి దూకుడైన షాట్లే కాకుండా అన్ని రకాల పరిస్థితుల్లోనూ బాగా బ్యాటింగ్ చేయగలననే నమ్మకం నాకుంది. భారీ షాట్లు ఆడబోయి పలు కీలక సమయాల్లో అవుటయ్యా. సిక్స్‌లు కొట్టడం మాత్రమే కాదు. జట్టును గెలిపించడం ముఖ్యం అని అర్థమైంది. అందుకే నా సాంకేతికంగా నా ఆటలో మార్పులు చేసుకొని గ్రౌండ్ షాట్‌లు కూడా చాలా ఆడుతున్నాను. -రిచా ఘోష్