హామిల్టన్‌ సిక్సర్‌

Lewis Hamilton Won The Tuscan Grand Prix Title - Sakshi

టస్కన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ సొంతం 

ఈ సీజన్‌లో ఆరో విజయం

టస్కన్‌ (ఇటలీ): గత రేసులో ఎదురైన పరాజయాన్ని పక్కనపెట్టిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మళ్లీ విజయం రుచి చూశాడు. ఆదివారం జరిగిన టస్కన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో తొమ్మిది రేసులు జరగ్గా అందులో హామిల్టన్‌కిది ఆరో విజయం కావడం విశేషం. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన హామిల్టన్‌ నిర్ణీత 59 ల్యాప్‌లను 2 గంటల 19 నిమిషాల 35.060 సెకన్లలో ముగించి తన కెరీర్‌లో 90వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మెర్సిడెస్‌ జట్టుకే చెందిన బొటాస్‌ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఈ క్రీడ చరిత్రలో 1000వ రేసులో బరిలోకి దిగిన ఫెరారీ జట్టుకు ఆశించిన ఫలితం రాలేదు.

ఆ జట్టు డ్రైవర్లు చార్లెస్‌ లెక్‌లెర్క్‌ 8వ స్థానంలో నిలిచి 4 పాయింట్లు... సెబాస్టియన్‌ వెటెల్‌ 10వ స్థానంలో నిలిచి ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకున్నారు. రేసులో మొత్తం 20 మంది డ్రైవర్లు పాల్గొనగా... 8 మంది రేసును పూర్తి చేయకుండానే వైదొలిగారు. తొలి ల్యాప్‌లోనే మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), పియర్‌ గ్యాస్లీ (అల్ఫా టౌరి) కార్లు ఢీ కొట్టుకొని తప్పుకోగా... ఐదో ల్యాప్‌లో మాగ్నుసెన్‌ (హాస్‌), గియోవినాజి (అల్ఫా రోమియో), కార్లోస్‌ సెయింజ్‌ (మెక్‌లారెన్‌) కార్లు ఢీ కొట్టుకోవడంతో రేసు నుంచి నిష్క్రమించారు. ఆరో ల్యాప్‌లో నికొలస్‌ లతీఫి (విలియమ్స్‌), ఏడో ల్యాప్‌లో ఒకాన్‌ (రెనౌ), 42వ ల్యాప్‌లో లాన్స్‌ స్ట్రాల్‌ (రేసింగ్‌ పాయింట్‌) వెనుదిరిగారు. రేసులో మూడుసార్లు అంతరాయం కలగడంతో గంటన్నరలోపే ముగియాల్సిన రేసు రెండు గంటలకుపైగా సాగింది. తొమ్మిది రేసుల తర్వాత హామిల్టన్‌ 190 పాయింట్లతో డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ విభాగంలో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఈనెల 27న సోచి నగరంలో జరుగుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top