
PC: Essex Cricket
ఇంగ్లండ్‌తో రెండో యూత్ టెస్టులో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) నిరాశపరిచాడు. సంప్రదాయ ఫార్మాట్లోనూ విధ్వంసకర రీతిలో ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ పద్నాలుగు బంతులు ఎదుర్కొని ఇరవై పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ ఫోర్‌తో పాటు.. రెండు సిక్సర్లు ఉన్నాయి.
ఇంగ్లండ్ పేసర్ అలెక్స్ గ్రీన్ (Alex Greeen) బౌలింగ్‌లో సిక్సర్ బాదిన సూర్యవంశీ.. తదుపరి బంతికి మరోసారి బంతిని గాల్లోకి లేపగా ఫ్రెంచ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కాగా ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 (India u19) క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.
వన్డేలలో ఇరగదీసిన వైభవ్
ఇందులో భాగంగా యూత్ వన్డేల్లో ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై ఆద్యంతం పైచేయి సాధించిన భారత్.. 3-2తో సిరీస్‌ను గెలిచింది. ఈ విజయాల్లో పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీది కీలక పాత్ర. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఐదు వన్డేల్లో కలిపి ఓ విధ్వంసకర శతకం (143) సాయంతో మొత్తంగా 355 పరుగులు సాధించాడు.
ఆరంభంలో నిరాశపరిచినా..
అయితే, ఇంగ్లండ్ తొలి యూత్ టెస్టు ఆరంభంలో మాత్రం వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఇక భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వైభవ్ 44 బంతుల్లోనే 56 పరుగులతో అదరగొట్టాడు. తద్వారా అత్యంత పిన్న వయసులో (14 ఏళ్ల 107 రోజులు) ఓ యూత్ టెస్టులో ఓ వికెట్ తీయడంతో పాటు అర్ధ శతకం కూడా బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
మళ్లీ ఫెయిల్
తాజాగా రెండో యూత్ టెస్టులో మాత్రం మరోసారి వైభవ్ అనుకున్న స్థాయిలో రాణించలేక నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ యువ జట్టుతో చెమ్స్‌ఫోర్డ్ వేదికగా ఆదివారం మొదలైన రెండో టెస్టులో.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
శతక్కొట్టిన ఏకాన్ష్ సింగ్
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 81.3 ఓవర్లలో 309 పరుగులు చేసింది. కెప్టెన్ థామస్ ర్యూ అర్ధ శతకం (59)తో మెరవగా.. భారత సంతతికి చెందిన ఏకాన్ష్ సింగ్ (117) శతకంతో ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో జేమ్స్ మింటో (46) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.
ఇక సోమవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 258 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే 24, వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి యూత్ టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే.
చదవండి: IND vs ENG: కరుణ్‌పై వేటు.. అతడి అరంగేట్రం?.. తుదిజట్టు ఇదే!