హార్ధిక్‌ను కెప్టెన్‌ చేసి, టీమిండియా నుంచి ఆ 'ఆరుగురిని' తప్పించండి..!

Fans Demand To Make Six Changes In T20 WC 2022 Team India - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొని, ఒట్టి చేతులతో ఇంటిదారి పట్టిన టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సూపర్‌-12 దశలో దక్షిణాఫ్రికా, సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటములు మినహాయించి.. టీమిండియా టోర్నీ మొత్తంలో ఆశించిన మేరకే రాణించి విజయాలు సాధించినప్పటికీ.. నాకౌట్‌ మ్యాచ్‌లో ఒత్తిడికి చిత్తై ఓటమిపాలవ్వడం భారత అభిమానులను తీవ్రంగా కలచి వేస్తుంది.

ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొన్న భారత జట్టులో సమూల మార్పులు చేయాలని టీమిండియా ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. జట్టు ప్రక్షాళణకు సమయం ఆసన్నమైందని సోషల్‌మీడియాలో తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌ జట్టులో ఆరుగురికి ఉద్వాసన పలకాలని కోరుతున్నారు. ఏకంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై సైతం వేటు వేయాలని సూచిస్తున్నారు.

బీసీసీఐ.. ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతే మున్ముందు మరిన్ని అవమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. విశ్రాంతి పేరుతో పదేపదే మార్పులు చేసి, జట్టు లయను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌ ఆడిన టీమిండియాలో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలపై వేటు వేసి దేవ్‌దత్‌ పడిక్కల్‌/రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌/సంజూ శాంసన్‌లతో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ నిర్ణయం సాహసోపేతమై అయినప్పటికీ.. జట్టు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మంచి నిర్ణయమేనని అంటున్నారు. పై పేర్కొన్న ఆటగాళ్లలో ఏ కాంబినేషన్‌ తీసుకున్నా, జట్టుకు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌ సమస్య కూడా తీరుతుందని అంటున్నారు.  అలాగే మిడిలార్డర్‌లో టెక్నిక్‌తో పాటు ధాటిగా ఆడగల సమర్ధుడైన శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవాలని.. శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌లు ఉన్నారు కాబట్టి, వరుసగా విఫలమవుతున్న పంత్‌ అవసరం కూడా లేదని అభిప్రాయపడుతున్నారు.

కనీసం బౌలర్‌గా కూడా న్యాయం చేయలేని అక్షర్‌ పటేల్‌... వికెట్లు తీయలేకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న వెటరన్‌ అశ్విన్‌, పదును తగ్గిన భువనేశ్వర్‌ల స్థానాల్లో రవీంద్ర జడేజా/దీపక్‌ హుడా, యుజ్వేంద్ర చహల్‌/కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రాకు అవకాశం కల్పించాలని బీసీసీఐకు రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

ఈ మార్పులు చేయడం వల్ల జట్టు సమతూకంగా ఉండటంతో పాటు సీనియర్లు, జూనియర్లు.. లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ల కాంబినేషన్స్‌తో అద్భుతంగా ఉంటుందని సలహా లు ఇస్తున్నారు. అలాగే రిజర్వ్‌ ఆటగళ్లుగా  భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రిషబ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ చాహర్‌, రవి భిష్ణోయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లకు ఛాన్స్‌లు ఇవ్వాలని కోరుతున్నారు.

ఫ్యాన్స్‌ కోరుకునే భారత టీ20 జట్టు: దేవ్‌దత్‌ పడిక్కల్‌/రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌/సంజూ శాంసన్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా/దీపక్‌ హుడా, మహ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, యుజ్వేంద్ర చహల్‌/కుల్దీప్‌ యాదవ్‌

రిజర్వ్‌ ఆటగాళ్లు: భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రిషబ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ చాహర్‌, రవి భిష్ణోయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

చదవండి: నిందించాల్సింది ఆటగాళ్లను కాదు, వాళ్లను.. ఒక్క లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ కూడా లేడా..?

 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top