హుస్నాబాద్: మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో భారీ వర్షాల కారణంగా పలు కాలనీల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పురోగతి, ఎల్లమ్మ చెరువు, పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బస్టాండ్‌ను ఆధునీకరిస్తాం
హుస్నాబాద్ బస్టాండ్ ఆధునీకరిస్తామని, వర్షాకాలంలో తలెత్తుతున్న ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి పొన్నం అన్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులను ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గురువారం హుస్నాబాద్ బస్టాండ్‌ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షం వస్తే బస్టాండ్‌లోకి వరద రావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో డ్రైనేజీ, వరద ఇబ్బందులను అధిగమిస్తామన్నారు. నాలుగు జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ చుట్టూ నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రయాణికుల రద్దీ, రెవెన్యూ సోర్స్ అధికంగా ఉన్న బస్టాండ్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
పెద్ద షాపింగ్ మాల్‌తో..
వర్షం వస్తే మునిగిపోతున్న బస్టాండ్ ఏరియాను అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉన్నామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. రోజు బస్టాండ్ నుంచి 35 వేల మంది ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారు. రెవెన్యూ పరంగా అత్యధిక ఆధాయం వచ్చే ఏ క్లాస్ కమర్షియల్ బస్ స్టేషన్‌ల్లో హుస్నాబాద్ ఒకటన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వారు సహకరిస్తే, మౌలిక సదుపాయాలతో పెద్ద షాపింగ్ మాల్ బస్టాండ్‌ను పునర్నిర్మిస్తామని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
క్యాంపు కార్యాలయంలో సమీక్ష


