పూర్తి స్థాయి ఈఓలు లేకపోవడంతో అభివృద్ధి పనులపై దృష్టి సారించడం లేదు. ఎనిమిదేళ్ల క్రితం బండ్ల గుట్టపై 50 గదుల నిర్మాణం చేపట్టారు. అది ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దేవాదాయ శాఖ అధికారులు సైతం ఎవరూ పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా పూర్తి స్థాయిలో అధికారి ఉండి పర్యవేక్షిస్తే ఎప్పుడో పూర్తి అయ్యేదని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. గదుల కొరతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దేవాలయానికి సమీపంలో దాసరి గుట్టపైన కాటేజీల నిర్మాణం కోసం రూ.6కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఆ పనులు సైతం అర్ధంతరంగా నిలిచిపోయాయి. క్యూ కాంప్లెక్స్ పనులు సైతం పూర్తి కాలేదు. అదే విధంగా ఆలయంలో పనిచేసే ఉద్యోగులపై సరైన మానిటరింగ్ లేకపోవడంతో సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉన్నత అధికారులు స్పందించి పూర్తి స్థాయి ఈఓను నియమించి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు.


