మున్సిపల్‌ కమిషనర్‌గా మల్లికార్జున్‌ | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కమిషనర్‌గా మల్లికార్జున్‌

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

సిద్దిపేటజోన్‌: సిద్దిపేట స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా మల్లికార్జున్‌ సోమవారం తాత్కాలికంగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆశ్రిత్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం హుస్నాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్‌ను తాత్కాలికంగా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టి అనంతరం అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లాస్థాయి బాడీ బిల్డింగ్‌ విజేతలకు సన్మానం

వర్గల్‌(గజ్వేల్‌): జిల్లాస్థాయి బాడీబిల్డింగ్‌ చాంపియన్‌ పోటీలో ప్రతిభ చాటిన వర్గల్‌ మండలం నెంటూరు యువకులను సర్పంచ్‌ బి.నాగరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం ఘనంగా సన్మానించారు. పంచాయతీ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ద్వితీయ బహుమతి పొందిన దుర్గాప్రసాద్‌, తృతీయ స్థానం పొందిన రాముయాదవ్‌, ప్రవీణ్‌తోపాటు, జిమ్‌ ట్రెయినర్‌, మాజీ సైనికోద్యోగి జి.హన్మంతును అభినందిస్తూ మెమెంటోలు అందజేశారు. శాలువాలు కప్పి సన్మానం చేశారు. భారతసైన్యంలో సేవలందించి పదవీవిరమణ పొందిన హన్మంతు చక్కని శిక్షణతో యువతను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

‘ప్రైవేట్‌’ను అరికట్టాలని వినతి

హుస్నాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మండల విద్యావనరుల కేంద్రంలోని సిబ్బందికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్‌ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ముందుగానే కల్పించాలన్నారు. పైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యంగా పుస్తకాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోయారు. సరైన సదుపాయాలు, ఆట స్థలాలు లేకున్నా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని, విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి బత్తుల రాజు, నాయకులు సంతోష్‌, అంజి, రంజిత్‌, చరణ్‌లు పాల్గొన్నారు.

రామంచలో బడిబాట

చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని రామంచలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలుక నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తామని చెప్పారు. తమ పిల్లలను బడికి పంచించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భవాని, హెచ్‌ఎం సురేశ్‌కుమార్‌, టీచర్లు పాల్గొన్నారు.

ఎంపీఓల

బాధ్యతల స్వీకరణ

మద్దూరు(హుస్నాబాద్‌): మద్దూరు, దూల్మిట్ట మండలాల పంచాయతీ అధికారులుగా జి.వెంకటేశ్వర్లు, మోహన్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట రూరల్‌ మండలంలోని చిన్నగుండవెల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు, సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న మోహన్‌ను డిప్యుటేషన్‌పై ఎంపీఓలుగా నియమితులయ్యారు. వారు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించి గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement