పర్యావరణం, పరిశుభ్రతపై గ్రామసభలు | - | Sakshi
Sakshi News home page

పర్యావరణం, పరిశుభ్రతపై గ్రామసభలు

Jun 9 2026 9:10 AM | Updated on Jun 9 2026 9:10 AM

పర్యావరణం, పరిశుభ్రతపై గ్రామసభలు

బెజ్జంకి(సిద్దిపేట): పర్యావరణం, పరిసరాల పరిశుభ్రతపై సోమవారం మండలంలోని దేవక్కపల్లె, ముత్తన్నపేట, దాచారం, నర్సింహులపల్లె, రామసాగరం, తోటపల్లి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలను వేరువేరుగా అందించాలని ఎంపీడీఓ ప్రవీణ్‌ సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

నిర్లక్ష్యం వద్దు..

హుస్నాబాద్‌రూరల్‌: వర్షాకాలంలో సీజనలు వ్యాధులు రాకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఎంఈఓ మనీల సూచించారు. గాంధీనగర్‌లో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంచేస్తే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్‌ పోలు సంపత్‌, కార్యదర్శి శ్రేయ, ఉపసర్పంచ్‌ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి

మద్దూరు(హుస్నాబాద్‌): సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని సర్పంచ్‌ చెట్కూరి కమలాకర్‌యాదవ్‌ అన్నారు. దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రమైన నీరు, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. అనంతరం గ్రామంలోని ఊరచెరువు చుట్టూ హద్దులు ఏర్పాటు చేయాలని డిప్యూటీ తహసీల్దార్‌ ఫయూంకు వినతిపత్రం అందజేశారు.

అచ్చుమాయిపల్లిలో

దుబ్బాకరూరల్‌: మండలంలోని అచ్చుమాయిపల్లి గ్రామంలో నిర్వహించిన సభలో సర్పంచ్‌ దేవరాజ్‌ మాట్లాడుతూ గ్రామంలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదన్నారు. తడిపొడి చెత్తను వేరుచేసి చెత్తను సేకరించే వాహనంలో వేయాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement