ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వానాకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారితో నివృత్తి చేసుకునేందుకు సాక్షి ఆధ్వర్యంలో ‘ఫోన్ ఇన్ డీఏవో’కార్యక్రమం నిర్వహిస్తుంది. సాగుకు ఉపయోగనించనున్న విత్తనాలు, యాజమాన్యం పద్ధతి, నకిలీ విత్తనాలను గుర్తించడం తదితర అంశాలపై రైతులు అడిగే సందేహాలను డీఏవో నివృత్తి చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫోన్ ద్వారా జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణితో మాట్లాడి రైతులు సలహాలు, సూచనలను పొందవచ్చును. ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 98668 98692, 86869 60064.
జిల్లా రవాణాశాఖ
అధికారిగా జోగేశ్వర్ జాదవ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా రవాణాశాఖ అధికారిగా జోగేశ్వర్ జాదవ్ శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను అందించారు. ప్రజలకు, వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ నూతన జిల్లా రవాణాశాఖ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో బదిలీపై వెళుతున్న ఇన్‌చార్జి డీటీవో లక్ష్మణ్, సిద్దిపేట ఎంవీఐ శివస్వప్న, తదితరులు పాల్గొన్నారు.
‘సంస్కార భారతి’
జిల్లా అధ్యక్షుడిగా బండోజు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సంస్కార భారతి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా బండోజు నరసింహచారి, కార్యదర్శిగా దుబ్బాక తిరుమలేశ్ నియామకం అయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఉమా, రాష్ట్ర సంఘటన మంత్రి నిరంజన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ఎంపిక చేశారు.
ప్రభుత్వ బడుల్లో
వసతులు కల్పించాలి
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫణీందర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లెల ఫణీందర్ అన్నారు. శనివారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని నియంత్రించాలని, అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు సరిగా లేవని, పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. పాఠశాల ఆవరణలు పరిశుభ్రంగా లేకపోవడం, కనీసం తాగునీరు సరిగా లేవని ఆరోపించారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హాస్టల్స్ కో కన్వీనర్ తరుణ్, లోకేశ్, హర్ష, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం అమ్మకాలపై నిషేధం
చేగుంట(తూప్రాన్): మద్య నిషేధంపై మండలంలోని బీ.కొండాపూర్ గ్రామ సభలో తీర్మానం చేశారు. మండలంలోని ఆరు గ్రామా ల్లో శనివారం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా, బీ.కొండాపూర్‌లో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్యర్యంలో మద్య నిషేధంపై తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. అలాగే వడియారంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ పాల్గొని ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ చిన్నారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


